ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.అయితే భారత్ వీసాలను నిలిపివేయడంతో అత్యవసర పనుల నిమిత్తం మనదేశానికి రావాల్సిన కెనడియన్లు, ప్రవాస భారతీయులు , వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై భారీగా ఫిర్యాదులు సైతం రావడంతో కేంద్ర విదేశాంగ శాఖ , కెనడాలోని ఇండియన్ హైకమీషన్ స్పందించింది.కెనడాలో నిలిపివేసిన అన్ని రకాల వీసా సేవలను అక్టోబర్ 26 నుంచి పున: ప్రారంభించనున్నట్లుగా తెలిపింది.

వీసా ప్రాసెసింగ్ ప్రారంభించగానే తిరిగి ఇరుదేశాల మధ్య సాధారణ పరిస్ధితులు నెలకొంటాయని అంతా భావించారు.కానీ దీనికి సుధీర్ఘ సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఈ విషయాన్ని భారతదేశం కానీ. న్యూఢిల్లీ( New Delhi )లోని అధినాయకత్వం కానీ అంత తేలిగ్గా వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.ప్రస్తుతం భారత్-కెనడా సంబంధాలు తీవ్ర సంక్షోభంలో వున్నాయని.బహుశా ఇది గతంలో ఎన్నడూ చూడలేదని వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్‌లోని సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టరర్ మైఖేల్ కుగెల్‌మాన్( Michael Kugelma ) అన్నారు.
సంక్షోభాన్ని నివారించడానికి ఇరుపక్షాలకు బలమైన ఆసక్తి, సంకల్పం వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

2020 నుంచి 2022 వరకు కెనడాలో భారత రాయబారిగా వ్యవహరించిన అజయ్ బిసారియా ( Ajay Bisaria )మాట్లాడుతూ.నిశ్శబ్ధ దౌత్యం తర్వాత సంబంధాలు డి ఎస్కలేషన్ దశలో వున్నాయన్నారు.కెనడాలో నివసిస్తున్న అక్కడ చదువుకోవడానికి ప్లాన్ చేస్తున్న వేలాది మంది భారతీయులు, భారత సంతతికి వ్యక్తుల రాకపోకలకు వీసాలపై నియంత్రణలు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.
ఉద్రిక్తతల ప్రభావం వ్యాపార, వాణిజ్య సంబంధాలపై పడకుండా ఇరుదేశాలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ఆలస్యం చేసింది.అలాగే భారత్‌తో కెనడా వైఖరిపై జీ7 దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే భారత్ అత్యంత కీలకం.
అందుకే ఇండియా – కెనడాలను తిరిగి కలపాలని అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.







