నల్లగొండ జిల్లా:భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎంఎల్)( CPI (ML) ) అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించాలని,నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కమిటీ విప్లవ శ్రేణులకు,సానుభూతి పరులకు,ప్రజలకు పిలునిస్తుందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు.భూమి,భుక్తి,విముక్తి కొరకు ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని,భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని, ఉద్యోగాలని,కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డిపోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెల్ల బట్టల వాళ్ళను చూస్తే భయపడే ఆదివాసి, గిరిజన,దళితులకు హక్కులను తెలియజేసి లక్షలాది ఎకరాల భూములను పంచి వెనకబడిన గ్రామాలకు విద్య,వైద్యం,విద్యుత్, రోడ్డు,రవాణా,కనీస సౌకర్యాల కోసమే పోరాటాలు నిర్వహించి గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములను ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర ఈ నక్సల్ బరీ ప్రతిఘటన ఉద్యమానిదేనని వారన్నారు.
కామ్రేడ్ వెంపటాపు సత్యం( Satyam ) ఆదిభట్ల కైలాసం,భత్తుల వెంకటేశ్వరరావు,నీలం రామచంద్రయ్య,పొట్ల రామనర్సయ్య,జంపాల చంద్రశేఖర్,ప్రసాద్ నుండి మొదలుకొని గుండాలలో జరిగిన కామ్రేడ్ పూనెం లింగన్న ఎన్కౌంటర్ వరకు ఎందరో వీరులు ప్రాణాలు ఇచ్చారని వారన్నారు.
నల్లగొండ జిల్లాలో కామ్రేడ్ యానాల మల్లారెడ్డి, విక్రమన్న,వీరారెడ్డి, బూరుగు అంజన్న,పలస భిక్షం,జెన్నుసార్,తోట సోమన్న లాంటి ఎందరో అమరులయ్యారని, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోరాట చరిత్ర ఉందని అది నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉందని వారన్నారు అమరవీరుల సంస్మరణ సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని ఆయన ఈ సమావేశంలో తెలియజేశారు.విప్లవకారుల పోరాటాలను చరిత్రను,నక్సల్ భరీ పోరాటాలను చరిత్రను, అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించాలని విద్యార్థి,యువకులు అమరుల ఆశయాలతో రాబోయే తరానికి కాబోయే వారసులుగా నిలబడాలని ఉద్యమాలకు ఊపిరిగా నిలబడాలని పిలుపునిచ్చారు.
అమరవీరుల స్పూర్తితో దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్)
న్యూడెమోక్రసీ
జిల్లా నాయకులు బొమ్మిడి నగేష్,బొంగరాల నర్సింహా, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి పోలె పవన్, అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎమ్ఎస్) జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి( Beereddy Sattireddy ),ఇఫ్టూ నాయకులు దాసరి నర్సింహా, అరుణోదయ జిల్లా నాయకులు ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రావుల సైదులు,లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.