ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.ఇదిలావుండగా.
కెనడా విపక్ష నేత పియరీ పోయిలీవ్రే( Pierre Poilivre ) భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాను తదుపరి దేశ ప్రధాని అయితే భారత్‌తో వృత్తిపరమైన సంబంధాన్ని పునరుద్ధరిస్తానని పేర్కొన్నారు.
కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారతీయ దౌత్యవేత్తలపై ద్వేషం, దేశంలో పెరుగుతున్న హిందూఫోబియాను ఆయన ఖండించారు.
నేపాల్ మీడియా ఔట్‌లెట్ ‘‘నమస్తే రేడియో టొరంటో’’కి( Namaste Radio Toronto ) ఇచ్చి ఇంటర్వ్యూలో పొయిలీవ్రే మాట్లాడుతూ.తమకు భారత ప్రభుత్వంతో వృత్తిపరమైన సంబంధం అవసరమన్నారు.భారత్ ఈ భూమ్మీద అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పారు.
కెనడాకు ప్రధాని అయితే భారత్‌తో వృత్తిపరమైన సంబంధాన్ని పునరుద్ధరిస్తానని పియరీ స్పష్టం చేశారు.భారత్ నుంచి 41 మంది కెనడియన్ దౌత్యవేత్తలు వెనక్కి రావడంపై స్పందిస్తూ.
ఎనిమిదేళ్ల తర్వాత ట్రూడో అంటే ఏంటో దేశ ప్రజలకు తెలుస్తోందన్నారు.కెనడియన్లు స్వదేశంలోనే ఒకరినొకరు వ్యతిరేకించుకునేలా చేయడంతో పాటు విదేశాలతో దేశ సంబంధాలను చెదరగొట్టాడని పొయిలీవ్రే మండిపడ్డారు.
ట్రూడో( Trudeau ) అసమర్ధుడని, ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి పెద్ద వివాదాల్లోనూ కెనడా తలదూర్చిందని, ఇందులో భారత్‌తోనూ వివాదం ఒకటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం టొరంటో, వాంకోవర్లలో( Toronto , Vancouver ) భారతీయ మిషన్‌లకు వ్యతిరేకంగా ఖలిస్తాన్ వేర్పాటువాదులు నిర్వహించిన కార్ ర్యాలీలను కూడా పొయిలీవ్రే ఖండించారు.హిందూ మందిరాలపై దాడులు, హిందూ నాయకులపై బెదిరింపులు, బహిరంగ కార్యక్రమాలలో భారతీయ దౌత్యవేత్తలపై చూపిన దూకుడు పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు.హిందూ మందిరాలలో ఆస్తులు, వ్యక్తులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పొయిలీవ్రే తెలిపారు.
ఇకపోతే.తాజాగా వెలువడుతున్న పోల్స్ ప్రకారం.
పొయిలీవ్రే కెనడాకు తదుపరి ప్రధాని కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు.అలాగే అతని పార్టీ సైతం లిబరల్ పార్టీ కంటే ఆధిక్యంలో వుంది.