టమాటా పంట సాగు ( Tomato Cultivation )ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.అయితే టమాటా పంట అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం తట్టుకోలేదు.
వర్షాకాలంలో టమాటాను సాగు చేస్తే పూత, పిందె రాలిపోవడం వల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.కాబట్టి వర్షాకాలంలో ఈ పంటను సాగు చేస్తే కొన్ని మెళుకువలు పాటించాలి.
అవి ఏమిటో చూద్దాం.టమాటా పంట సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి కానీ చౌడు భూములు మాత్రం ఈ పంటకు అనుకూలంగా ఉండవు.
వర్షాకాలంలో( Rainy season ) సాగు చేయాలనుకుంటే జూన్ మొదటి వారం నుంచి జూలై రెండవ వారం వరకు విత్తుకోవడానికి మంచి సమయం.
ఒక ఎకరానికి 200 గ్రాముల విత్తనాలు అవసరం.ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.కిలో విత్తనాలకు మూడు గ్రాముల మెటాలాక్సిల్, రెండు గంటల తర్వాత నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కల్చర్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఆ తరువాత ఐదు గ్రాముల ఇమిడా క్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.టమాటా నారును సాధారణ పద్ధతిలో కాకుండా నారుమడిలో పెంచాలి.ఎత్తుగా ఉండే నారుమళ్ళను ఏర్పాటు చేసుకుని నారు పెంచాలి.నారుకు ఎటువంటి కుళ్ళు సోకకుండా 0.5% బోర్ధో మిశ్రమం ను లీటర్ నీటిలో కలిపి నారుమడిని తడపాలి.ఆ తర్వాత నారుమడిలో విత్తనాలు( seeds ) విత్తిన తర్వాత వరిగడ్డితో నారుమళ్ళను గడ్డితో కప్పి నీటిని అందించాలి.
విత్తనాలు మొలకెత్తిన పది రోజుల తర్వాత ఆ గడ్డిని తీసేయాలి.
టమాటా నారు 25 రోజుల వయసుకు వచ్చాక ప్రధాన పొలంలో నాటుకోవాలి.మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.పూత దశలో ఉన్నప్పుడు ఒక లీటర్ నీటిలో 20 గ్రాముల యూరియా కలిపి పిచికారి చేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది.
పూత దశలో ఉన్నప్పుడే ఒక మిల్లీలీటర్ ప్లానోఫిక్స్( Planofix ) ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే పూత, పిందే రాలిపోకుండా ఉండి దిగుబడి పెరుగుతుంది.