ప్రతిపక్ష నేత చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ తర్వాత అత్యంత వేగంగా స్పందించిన జనసెన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల్ని, నాయకుల్ని ఆశ్చర్యపరిచారు.హైదరాబాదు నుంచి హుటాహుటీన రావడం దగ్గర్నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుకు మద్దతు ఇచ్చి పొత్తు ప్రకటన చేసే వరకు ఆయన నిర్ణయాలు జెడ్ స్పీడ్ లోనే సాగాయి.
ఆ తర్వాత జనసేన నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన పవన్ పొత్తుకు దారి తీసిన పరిస్థితులను వివరించి వారిని సమాధానపరచగలిగారు .ఆ తర్వాత నుంచి ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని, ప్రభుత్వ తీరుపై ఉమ్మడిగా పోరాటాలు చేస్తారని వార్తలు వినిపించాయి.అయితే ఇప్పటివరకు ఉమ్మడి కార్యాచరణ పై కానీ పోరాటాలపై కానీ ఏ విధమైన వార్తలు బయటకు రాలేదు.పవన్ కనీసం మీడియా ప్రకటనలు కూడా ఆ తర్వాత చేయలేదు.
ఉన్నట్టుండి పవన్ ఇంత నిశ్శబ్దంగా మారడం వెనక కారణాలు ఏమిటా అన్నది అంతుపట్టని విధంగా ఉంది.

ఎవరికి వారు ఈ విషయంలో తమకు తోచిన విశ్లేషణ చేస్తున్నారు.కేంద్ర బాజాపా నుంచి వచ్చిన స్పష్టమైన సంకేతాలతోనే పవన్ సైలెంట్ అయ్యారని ఒక వర్గం వాదిస్తుంటే, కోర్టులో ఉన్న విషయాలపై అనవసరంగా స్పందిస్తే చట్ట ప్రకారం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నందుకే ఆయన సైలెంట్ అయ్యారని మరి కొంతమంది విశ్లేషిస్తున్నారు.మరోపక్క టిడిపి భవిష్యత్తు వారసురాలిగా నారా బ్రాహ్మణి ( Nara Brahmani )ని టిడిపి మీడియా ప్రొజెక్ట్ చేయడం, లోకేష్( Lokesh ) అరెస్టు భయంతో ఢిల్లీలోనే ఉన్నారన్న ప్రచారం జరగటంతో తన స్పందన కు ఇది సరైన సందర్భం కాదు అన్న ఆలోచనతోనే పవన్ సైలెంట్ అయినట్లుగా తెలుస్తుంది.
ఏది ఏమైనా ఒకసారి చంద్రబాబుకు బెయిల్ దొరికితే రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుందని రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వ విధానాల్ని నిరసించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.ప్రస్తుతం లీగల్ టీం తోనే పని కాబట్టి పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా తెలుస్తుంది.