ఇప్పటికే బీఆర్ఎస్( BRS ) అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచింది .ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి స్క్రీనింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియను చేపట్టింది .మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్( Congress ) సిద్ధమవుతోంది.కచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్ కేటాయించాలని నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే ఢిల్లీ స్థాయిలో అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ మొదలైంది.ఇప్పటికే 70 స్థానాల్లో అభ్యర్థుల దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.మిగతా స్థానాల్లో ఎంపిక పనుల్లో స్క్రీనింగ్ కమిటీ నిమగ్నమైంది.
ఫైనల్ జాబితా సిద్ధం చేసుకుని ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిద్దమవుతుంది.ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తుండడం తో ఆశావాహులంతా ఢిల్లీకి క్యూ కడుతూ , తమ పలుకుబడి ద్వారా తమ టికెట్ ను ఖాయం చేసుకునే పనుల్లో నిమగ్నం అయ్యారు.ఇక వరుస వరుసగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతూ ఉండడం ఆ పార్టీలో ఉత్సాహం కలిగిస్తోంది .అయితే ఇలా చేరిన వారికి టికెట్ హామీ కూడా ఇస్తున్నారు.అయితే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ,( Mynampally Hanumanth Rao ) ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ తమతోపాటు కుటుంబ సభ్యులకు టికెట్ కోరుతుండడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.
మైనంపల్లి హనుమంతరావు కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ దక్కినా, తన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతోనే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు .ఇప్పుడు కాంగ్రెస్ లో మైనంపల్లికి టికెట్ ఇచ్చినా, ఆయన కుమారుడుకి టికెట్ ఇచ్చే విషయంపై తర్జన భర్జన జరుగుతుంది.ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ ( Rekha nayak )కు టికెట్ ఖాయం అయినా, తన భర్త శ్యామ్ నాయక్ కి కూడా టికెట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు .దీంతో ఉదయపూర్ తీర్మానాన్ని కొంతమంది నేతలు ప్రస్తావిస్తున్నారు.పార్టీ నేతల కుటుంబానికి ఒకటే టికెట్ అని, కనీసం ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికే రెండో టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఉదయపూర్ తీర్మానంలో నిర్ణయించడంతో, ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
దీంతో మైనంపల్లి, రేఖ నాయక్ ల పరిస్థితి ఎటు అర్థం కాకుండా ఉంది.వీరి కుటుంబాల్లో రెండు టికెట్లు కేటాయిస్తే మిగతా నాయకులు దీనిపై రాద్దాంతం చేసే అవకాశం ఉండడం , తమ కుటుంబ సభ్యులకూ టిక్కెట్ ఇవ్వాలని సీనియర్ నేతలు రచ్చ చేసే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ ఈ విషయంలో టెన్షన్ పడుతోంది.