వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినా, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటాలు చేపట్టినా, పాదయాత్ర ద్వారా తెలంగాణ అంతటా పర్యంటించినా, ఆశించిన స్థాయిలో ఆ పార్టీ బలోపేతం కాలేకపోయింది.
అలాగే చేరికలు కూడా పెద్దగా లేకపోవడంతో షర్మిల పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
ఇక పార్టీని ఒంటరిగా ముందుకు తీసుకువెళ్లడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన షర్మిల( Y S Sharmila ) కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు నిర్ణయించుకున్నారు .ఈ మేరకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంతనాలు చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party (ని విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అంగీకరించారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అడుగు పెట్టకూడదని , ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు అధిష్టానం పై ఒత్తిడి పెంచడంతో, షర్మిలను ఏపీ రాజకీయాల్లో కీలకం కావాలని సూచించారు.
అయితే తాను మాత్రం ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టేదే లేదని, తెలంగాణలోనే ఉంటానని , పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల కాంగ్రెస్ కు తేల్చి చెప్పారు.దీంతో విలీన ప్రక్రియ నిలిచిపోయింది.ఒకవైపు చూస్తే కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది.
అభ్యర్థుల ఎంపిక నుంచి దరఖాస్తు స్వీకరించడంతో పాటు , మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది .ఇక పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం మాజీ ఎంపీ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) పోటీ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది .మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉండడంతో షర్మిల పరిస్థితి గందరగోళంగా మారింది.ఈ పరిస్థితుల్లో షర్మిల రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.