నల్గొండ జిల్లా: గుర్రంపోడ్ మండలం కొప్పోల్ లోని ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి నోచుకోక సమస్యలకు నిలయంగా మారింది.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్ల జాగతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇచ్చారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇందిరమ్మ కాలనీలో ఒక్క సీసీ రోడ్డు కానీ,ఒక్క మోరీ కానీ, కట్టిన పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో పోటాపోటీగా ఉచిత హామీలు ఇచ్చి వెళ్లడమే తప్ప మాకు చేసిందేమి లేదని అంటుటున్నారు.
డ్రైనేజి వ్యవస్థ లేక ఇండ్ల మధ్య మురికి నీరు నిలిచి దోమలతో అనేక రకాల జబ్బులు వస్తున్నాయని,
సీసీ రోడ్లు నిర్మించక బజార్లలన్ని కంప చెట్లతో నిండిపోయాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తమ కాలనీ సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రజా ప్రతినిధులు,కానీ, అధికారులు కానీ మా కాలనీ వంక చూసిన వారే లేరని కామళ్ళ భిక్షం అన్నారు.మా కాలనీలో కనీస మౌళిక సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొటున్నా మా వంక చూసిన వారే లేరు.
బజార్లన్ని మురికినీటితో నిండిపోయాయని,దోమల బెడదతో అవస్థలు పడుతున్నామని, దారులన్నీ కంపచెట్లు అలుముకున్నాయని, అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.