ట్రాన్స్ జెండర్, అట్టడుగు వర్గాలకు రూత్ జాన్ కొయ్యల ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైద్య పీజీ సీటు పొందిన ఖమ్మం జిల్లా కు చెందిన ట్రాన్స్ జెండర్ రూత్ జాన్ కొయ్యల ను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో ట్రాన్స్ జెండర్ లకు ఎక్కడా గుర్తింపు లేదని, వారిలో చదువుకున్న వారు చాలా తక్కువని, ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను దాటుకుని రూత్ జాన్ కొయ్యల చరిత్ర సృష్టించారని అన్నారు.రెండు సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి, ట్రాన్స్ జెండర్ కోటాలోనే పీజీ సీట్ సంపాదించారని ఆయన తెలిపారు.
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని, పీజీ పూర్తయిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని ఆయన అన్నారు.ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి, లక్ష్యం సాధించడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రూత్ జాన్ కొయ్యల మాట్లాడుతూ, అవకాశం కోసం చూడడం కాక, అవకాశాలను సృష్టించాలానే ధ్యేయంగా కష్టపడి చదివినట్లు తెలిపారు.నట జీవితంలో కాక, నిజ జీవితంలోనే ఏదైనా సాధించవచ్చన్నారు.
రానున్న రోజుల్లో ట్రాన్స్ జెండర్లకు మంచి అవకాశాలు రావాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా.బి.మాలతి, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.







