సూర్యాపేట జిల్లా: జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ అడిగే ప్రశ్నలకు7 సమాధానం చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన పలు అంశాలపై ముఖ్యమంత్రికి ప్రశ్నావళిని సంధించారు.
మీరు ప్రారంభించబోతున్న నూతన కలెక్టర్ కార్యాలయ పరిసర ప్రాంత భూములను దళితుల దగ్గర అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి నేడు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, దళితులను,ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న వారెవరో మీకు తెలుసా…? చెరువు భూములను, ఆ ప్రాంతంలోని కుంటలను సైతం వదలకుండా రియల్ దందా కోసం కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న విషయం మీ దృష్టిలో ఉందా?సూర్యాపేట పట్టణ సుందరీకరణ రోడ్లు వెడల్పు పేరిట మెయిన్ రోడ్డులో దాదాపు 80 కుటుంబాల వారు 60 సంవత్సరాలుగా నివాసం ఉంటూ చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటున్న వారి ఇళ్ళను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి కనీసం నష్ట పరిహారం ఇవ్వకుండా వారిని మోసం చేసి, రోడ్డున పడవేసిన విషయం మీకు తెలుసా?
సూర్యాపేట పట్టణ ప్రధాన వీధుల్లో పట్టపగలే కత్తులతో స్వైర విహారం చేస్తుంటే,శాంతిభద్రతలు క్షీణించి ప్రజలు భయబ్రాంతులతో ఉన్న పరిస్థితి మీ దృష్టికి వచ్చిందా?సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట మంజూరీ అయిన కోట్ల రూపాయల పనులన్నీ ఒకరిద్దరు కాంట్రాక్టర్లకే అప్పజెప్పి, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులను నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్న విధానం మీ దృష్టికి వచ్చిందా?సూర్యాపేటలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరీ చేస్తామని గతంలో మీ పార్టీ ఇచ్చిన హామీని ఎందుకు నేరవేర్చలేకపోయరో చెప్పగలరా?జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ మంత్రి తమ సమీప బంధువుకే కట్టబెట్టి, ఉద్యోగాలివ్వడంలో లక్షల రూపాయలు దండుకుని భారీ అవినీతి పాల్పడిన విషయం మీకు తెలుసా?దళితబంధు పథకంలో లబ్దిదారుల ఎంపిక నుండి, యూనిట్ లో గుర్తింపు, అమలు వరకు అవినీతి జరుగుతున్నదని,అది తెలుసునని మీరే అన్నారు కదా,మరి ఏమైనా విచారణ జరిపించారా? ఎందుకు విచారణ జరపడం లేదు?
ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చిన స్థానిక మంత్రి మాట తప్పడం మీ దృష్టిలో ఉందా?నియోజకవర్గంలోనిర్మాణం పూర్తయి నాలుగు సంవత్సరాలు దాటినా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయలేని పరిస్థితి మీకు తెలుసా?సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా ఎస్సి మహిళకు కేటాయించడం చాలా సంతోషం.కానీ,పాలక మండలిని ఉత్సవ విగ్రహంగా మార్చి,మంత్రి కనుసైగలతో కమీషనరే మొత్తం అధికారం చెలాయిస్తున్న తీరు మీ దృష్టికి వచ్చిందా.
సూర్యాపేటలో అంతర్గత రోడ్ల నిర్మాణం కాక, నాలాలు నిర్మించక పెద్ద ఎత్తున గుంటలు పడి వాహనదారులు పడుతున్న ఇబ్బందులు మీకు తెలుసా?గతంలో మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు అనే విషయాన్ని మరిచారా? మళ్ళీ అలవికాని హామీలిచ్చి సూర్యాపేట ప్రజలను మరొకసారి మభ్య పెట్టేందుకు వస్తున్నారా? జిల్లా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఈ పై ప్రశ్నలకు మీనుండి సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నాం.ఇంకా ఎన్నో,ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సూర్యాపేట ప్రజలకు మీ నుండి మళ్ళీ ఒట్టి మాటలు కాకుండా అమలయ్యే నిజమైన హామీల కోసం పట్టుబడుతున్నాం.
ఈ పై సమస్యలకు సమాధానం ఇవ్వకపోతే మీరు పలాయనవాదం ఆచరిస్తున్నట్లుగా భావించి మీ పర్యటనను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం.