ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని పథక ఆవిష్కరణ చేసిన కల్వకుంట్ల తారక రామారావు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 Minister Ktr Independance Day Celebrations At Rajanna Sircilla District Collecto-TeluguStop.com

ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది.రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంతరించి, భారత స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 76 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.

ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని, దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత.

సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని చాటిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్య్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరుదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహానీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం.

స్వాతంత్య్ర పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు.

జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నాం.

స్వాతంత్య్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది.

ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నది.నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రూపొందింది.

తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో.అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది.

రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.దేశానికే దారిచూపే ‘టార్చ్‌ బేరర్‌’ గా తెలంగాణ నిలిచింది.

సాగు సంబురం :

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలను గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకువచ్చింది.ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మే కేసీఆర్ గారు… దేశ చరిత్రలో ఏ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుంది.జిల్లాలో రైతుబంధుతో ఇప్పటి వరకు 11 విడతల్లో 1 వేయి 176 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం.రైతుబంధు ద్వారా సుమారు 1 లక్ష 18 వేల మంది రైతులకు లబ్ది కలుగుతుంది.

అప్పురూపంలో కాకుండా పెట్టుబడి రూపంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేసిన తొలి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు ఒక్కరే.రైతుబంధు విజయంతో కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ స్ఫూర్తిగా రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టాయి.

రైతు బీమాతో రైతన్నలకు ఒక గొప్ప భరోసాను అందించిన మానవీయ సర్కారు తెలంగాణ.రైతుల తరుపున ప్రభుత్వమే బీమా ప్రీమియంను చెల్లించి దురదృష్టవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 ల‌క్ష‌లు ఇస్తూ భరోసాను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 1 వేయి 873 మంది రైతు కుటుంబాలకు 93 కోట్ల 60 లక్షల బీమా పరిహారం చెల్లించాం.

ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగుజలాలు, భూగర్భ జలాల లభ్యత పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016 లో ఉన్న 1 లక్షా 77 వేల 960 ఎకరాలలో నికర సాగుభూమి కాస్త 2023 నాటికి 2 లక్షల 40 వేల 430 ఎకరాలకు పెరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ప్యాకేజి-9 మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలే విజయవంతం అయింది.

దీని ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 96 వేల 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.రైతులకు సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అనే ఉద్దేశ్యంతో తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం.దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతిగింజా కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

రైతు రుణమాఫీ :

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి పున:ప్రారంభించి, పూర్తిచేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు.ఇప్పటికే చేసిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది.వచ్చే 40 రోజుల్లో రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.

విద్యుత్ రంగం:

వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ.రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ బావులకు ప్రతినెల 27 కోట్ల రూపాయలు వెచ్చించి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.

అతిపెద్ద ఆక్వాహబ్:

తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.ఇప్పటికే చేపపిల్లల ఉచిత పంపిణీతో మత్స్య రంగం దశ దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం, మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా మధ్యమానేరులో 366 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వాహబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

దీని ద్వారా 5 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.అక్వాహబ్ ను జిల్లాలో కొత్తగా రానున్న రైల్వే ప్రాజెక్టుతో అనుసంధానం చేయనున్నాం.

జలవిప్లవానికి తోడు మరో నాలుగు విప్లవాలు:

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో నిర్మించిన తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జల విప్లవం వచ్చింది.దీనికి అనుసంధానంగా మరో నాలుగు విప్లవాలు హరిత విప్లవం.

గులాబీ, నీలి, క్షీర విప్లవాలను చూస్తున్నాం.పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడిపశువుల అభివృద్ధి వల్ల క్షీర విప్లవాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.

మిషన్ కాకతీయ:

సమైక్య పాలనలో పట్టింపులేనితనంతో ఆనవాళ్లను కోల్పోయిన జలవనరులకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది.మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో నాలుగు దశల క్రింద ఇప్పటివరకు 102 కోట్ల 79 లక్షల రూపాయలతో 294 చెరువుల పనులు పూర్తయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మానేరు వాగుపైన అప్పర్ మానేరు, మిడ్ మానేరు మధ్య 11, మూలవాగు పై 13 చెక్ డ్యామ్ లను మొత్తం 24 చెక్ డ్యామ్ లను 155 కోట్ల రూపాయలతో చేపట్టాము.ఇందులో 8 చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి.12 చెక్ డ్యాం పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి.

ఇంటింటికీ త్రాగునీరు:

ఖాళీ బిందెలతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు, ట్యాంకర్ల దగ్గర నీటి యుద్ధాలను, తాగునీటి తండ్లాటలను సమూలంగా రూపుమాపిన మరో విప్లవం మిషన్ భగీరథ.స్వతంత్ర భారత చరిత్రలో స్వచ్ఛమైన మంచినీళ్లను ప్రజల ప్రాథమిక హక్కుగా అమలుచేసి ఇంటింటికి మంచినీళ్ళనిచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే.దీనిని ప్రేరణగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ జల్ యోజన” కార్యక్రమాన్ని చేపట్టడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం.మిషన్ భగీరథ పథకం క్రింద జిల్లాలో 1 వేయి 258 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత త్రాగునీరు అందిస్తున్నాం.

డబుల్ బెడ్ రూం ఇండ్లు:

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేలా అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తుంది.జిల్లాలో ఇప్పటి వరకు 3 వేల 443 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశాం.తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులో సిరిసిల్ల పట్టణ లబ్దిదారులకు 27 ఎకరాల్లో సుమారు 87 కోట్ల 67 లక్షల రూపాయలతో నిర్మించిన 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశాం.రగుడు, శాంతి నగర్, పెద్దూర్ లో 792 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలో లబ్దిదారులకు అందజేయనున్నాం.

“గృహలక్ష్మి”

సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే “గృహలక్ష్మి” పథకానికి మొన్ననే దరఖాస్తులు స్వీకరించాం.తొలి విడతలో ఈ సంవత్సరం నియోజకవర్గంకు 3 వేల ఇండ్ల చొప్పున ఇండ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తున్నాం.తరతమ భేదం లేకుండా గుడిసెల్లో నివసిస్తున్న వారికి, శిథిలావస్థలో ఇండ్లున్న వారికి ఇండ్ల మంజూరులో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నాం.

‘తెలంగాణకు హరితహారం’:

పర్యావరణ పరిరక్షణకు ప్రతీ మానవుని విద్యుక్త ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి గారు ‘తెలంగాణాకు హరితహారం’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు.తెలంగాణకు హరితహారం స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి, కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు.

రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు తమ వార్షిక బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి పచ్చదనం పెంపునకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాయి.జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతలలో 4 కోట్ల 78 లక్షల మొక్కలను జిల్లా వ్యాప్తంగా నాటాము.

“ఆసరా”:

ముఖ్యమంత్ర్రి కేసీఆర్ అభిప్రాయం ప్రకారం పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్ధిక ప్రగతి అస్థిరమైనది, అనైతికమైనది.ఆ ఉద్దేశ్యంతోనే పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహ భాగం నిధులను వెచ్చిస్తున్నది.

గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయలు పెన్షన్ ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం ఆసరా ఫించన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2 వేల 16 రూపాయలకు పెంచింది.దివ్యాంగులకు 4 వేల 16 రూపాయలకు పెంచింది.

ఎవ్వరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు సైతం 2 వేల 16 రూపాయల ఫించన్ నెల నెలా అందజేస్తుంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం జిల్లాలో 56,116 మందికి మాత్రమే పెన్షన్ అందేది.

ప్రస్తుతం జిల్లాలో 1 లక్షా 20 వేల 802 మంది నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్ అందజేస్తుంది.ఇందుకు గానూ ప్రభుత్వం ప్రతినెల 25 కోట్ల 66 లక్షల రూపాయలను వెచ్చిస్తుంది.

మహిళా సంక్షేమం:

మహిళా సంక్షేమంలో.మన తెలంగాణ రాష్ట్రం.

యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి… ఆరు పదులు దాటిన అవ్వల వరకు.

అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది మనసున్న కేసీఆర్ సర్కార్.గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, ఆడబిడ్డ పుట్టిందంటే… కేసిఆర్ కిట్ తో పాటు అందే 13 వేలు అందజేస్తుంది.

తెలంగాణ ఆడబిడ్డలకు కార్పొరేట్ కు ధీటైన గురుకులాలను ఏర్పాటు చేసింది.ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన “షీటీమ్” లు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే “వీహబ్” ఏర్పాటుతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం, మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది.

ప్రతీ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేస్తుంది.భ్రూణహత్యలకు, బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసాగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ను అమలు చేస్తుంది.

గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా సీఎం కేసిఆర్ తీర్చారు.మన అంగన్ వాడీలను, ఆశా కార్యకర్తలను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసి, దేశంలోనే అత్యధిక పారితోషికాలతో.

గౌరవప్రదంగా జీవించేలా చేశారు.ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణకు సాటైన, ధీటైన రాష్ట్రం లేదు.

అమ్మఒడి వాహనం..ఆరోగ్యలక్ష్మి పథకాలకు నీతి ఆయోగ్ ప్రశంసలు లభించాయి.భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.

ఒంటరి మహిళలకు తండ్రిలా… ఆడబిడ్డలకు మేనమామలా.అవ్వలకు పెద్దకొడుకులా…సీఎం కేసిఆర్ గారు కొండంత అండగా నిలుస్తున్నారు.జిల్లాలో ఇప్పటివరకూ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 22 వేల 95 మంది లబ్దిదారులకు 201 కోట్ల 96 లక్షల 64 వేల రూపాయలు, షాదీ ముబారక్ పథకం ద్వారా 1 వేయి 17 మంది లబ్దిదారులకు 9 కోట్ల 1 లక్షా 61 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశాం.

వైద్య,ఆరోగ్య రంగం:

సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే.గాలిలో దీపం అన్నట్లు ఉండేది.స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపు వచ్చింది.నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.నేడు ప్రభుత్వ ఆసుపత్రికెళితే ఒక ధైర్యం, భరోసాను ప్రభుత్వం ఇచ్చింది.

కేసీఅర్ కిట్ల నుంచి…న్యూట్రిషన్ కిట్ల దాకా… డయాలసిస్ సెంటర్ల నుంచి… డయాగ్నోస్టిక్ కేంద్రాల వరకు… పల్లె, బస్తీ దవాఖానా నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం తెలంగాణ వైద్యారోగ్య రంగ ప్రస్థానంలో విప్లవాత్మక మార్పులకు కారణం అయ్యింది.ఫలితంగా “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు” అనే దశాబ్దాల దుస్థితి నుంచి… “చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు” అనేలా రోగులకు తెలంగాణ సర్కార్ ధీమానిచ్చింది.

మాత శిశు మరణాల రేటును భారీగా తగ్గించడం ప్రభుత్వం సాధించిన మానవీయ విజయం.జిల్లాలో ఇప్పటి వరకూ 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ ఎన్ క్వాస్ లభించడం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది.

జిల్లా, ఏరియా ఆసుపత్రులలో గర్భిణులకు సహాయకారిగా ఉండేందుకు మాతృ సేవా కార్యక్రమంను ప్రారంభించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు 70 శాతం పెంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు.

ఇప్పటికే సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలకు తోడుగా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభించుకోనున్నాం.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన వైద్యులు స్థానికంగానే ఉంటూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నారు.తద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు దూరభారం, ఆర్థిక భారం తగ్గనుంది.

కే‌సి‌ఆర్ కిట్:

జిల్లాలో ఇప్పటి వరకు 18 వేల 211 మంది బాలింతలకు కె.సి.ఆర్ కిట్ లను పంపిణీ చేయడం జరిగింది.గర్భవతులు, బాలింతలకు వారి ఖాతాలో 19 కోట్ల 76 లక్షల 83 వేల రూపాయలు కే‌సి‌ఆర్ కిట్ లో భాగంగా జమ చేయడం జరిగింది.జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు 47 శాతం నుండి 70 శాతంకు పెరిగాయి.

వృద్ధులకు బాసటగా డే కేర్ సెంటర్:

మలిసంధ్యలో ఉన్న వృద్ధులు ఆత్మగౌరవంతో బ్రతికేలా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధుల సంరక్షణ కేంద్రం (డే కేర్ సెంటర్) ను ఏర్పాటు చేశాం.తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన వృద్ధాశ్రమం ఇటీవలే ప్రారంభించుకున్నాం.

రోడ్లు,భవనాలు మరియు మౌళిక వసతుల కల్పన:

సిరిసిల్ల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు 95 కోట్ల రూపాయలతో 11 కిలోమీటర్ల మేర రగుడు నుండి వెంకటాపూర్ వరకు నిర్మిస్తున్న 4 వరుసల బైపాస్ రహదారి నిర్మాణం పూర్తిచేశాం.అలాగే ఎల్లమ్మ జంక్షన్ నుండి రగుడు వరకు 35 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.

జిల్లా కేంద్రం సిరిసిల్లలో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా అన్ని హంగులతో సెల్లార్ తో కూడిన మూడు అంతస్తుల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం 64 కోట్ల 70 లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా నిర్మించబడి అందుబాటులోకి వచ్చింది.సిరిసిల్లలో 8 కోట్ల 50 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాం.

తెలంగాణ దళిత బంధు:

శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణ కోసం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళితబంధు.దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల పాలిట భాగ్యరేఖగా మారింది.జిల్లాలో దళితబంధు పథకంలో భాగంగా తొలివిడతలో మొత్తం 206 మంది లబ్దిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ చేయడం జరిగింది.

జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం ప్రతీ లబ్దిదారునితో ప్రత్యేకంగా సమావేశమై లాభదాయక యూనిట్లను స్థాపించుకునేలా దళితబంధు లబ్దిదారులకు మార్గదర్శనం చేయడం జరిగింది.దశలవారిగా జిల్లాలోని పేద దళిత కుటుంబాలకు దళితబందు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం సంతృప్తస్థాయిలో అందజేయనుంది.

బీసీ, ఎంబీసీలకు లక్ష రూపాయల గ్రాంట్:

సమాజంలో ఏ పేద వర్గాన్ని వదిలి పెట్టకుండా ప్రభుత్వం కృషి చేస్తుంది.అందులో భాగంగానే కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అత్యంత వెనుకబడిన తరగతులైన బీసీ, ఎంబీసీ కులవృత్తులకు ఒక లక్ష రూపాయల గ్రాంట్ ను ప్రభుత్వం అందిస్తుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో 600 మంది లబ్ధిదారులకు ఇటీవలే ఆర్ధిక సహాయం అందజేశాం.అర్హులైన ప్రతి వ్యక్తికి అందే వరకూ నిరంతర ప్రక్రియగా ఈ పథకాన్ని కొనసాగిస్తాం.

పోడు భూములకు పట్టాల పంపిణీ:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 6 మండలాల పరిధిలో 60 గ్రామాలకు చెందిన 1 వేయి 614 మంది గిరిజన రైతులకు 2 వేల 858 ఎకరాలకు సంబంధించిన పోడు భూముల పట్టాలను అందజేశాం.

మైనారిటీ సంక్షేమం:

అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది.స్వయం ఉపాధి పథకాల క్రింద బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో ఇప్పటి వరకు 146 మంది లబ్దిదారులకు 1 కోటి 13 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగింది.ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలకు సంబంధించిన మసీదులు, షాదీఖానాలు, చర్చీలు, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం కొరకు గ్రాంట్ – ఇన్ ఎయిడ్ పథకం క్రింద 98 పనులకు గానూ 5 కోట్ల 61 లక్షల రూపాయలు మంజూరు చేశాం.అల్పసంఖ్యాక వర్గాల మహిళలకు 500 కుట్టు మిషన్లు పంపిణీ చేశాం.

ఎడ్యుకేషన్ హబ్ గా సిరిసిల్ల:

విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.జిల్లాలో ఐటీఐ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, డా.బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది.

మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి:

విద్యతోనే వికాసం. విద్యతోనే ఆత్మవిశ్వాసం.

తరగతి ఆ నాలుగుగోడలే.దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలు అన్న సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.

అక్షరాలా ఆచరించింది తెలంగాణ ప్రభుత్వం.తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవంతో యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోంది.

దేశ చరిత్రలోనే అత్యధిక గురుకులాలు స్థాపించడంతో పాటు కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలుగా తీర్చిదిద్దబడుతున్నాయి.గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ఒక లక్షా 25 వేలను ప్రభుత్వం వెచ్చిస్తుంది.

సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టింది.సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తుంది.

ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి.మన జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఈ కార్యక్రమం కింద తొలి విడతలో జిల్లాలో 48 కోట్ల రూపాయలతో 172 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం జరిగింది.జిల్లాలోని పది పాఠశాలల్లో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కార్పోరేట్ సంస్థల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం.

టీ.ఎస్.ఐ పాస్:

జిల్లా ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాలసీ క్రింద 1 వేయి 296 కోట్ల రూపాయల పెట్టుబడితో 825 పరిశ్రమలు స్థాపించబడి ఉత్పత్తి ప్రారంభించాయి.తద్వారా 6 వేల 568 మందికి ఉపాధి కల్పించాం.జిల్లాలో షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు టి –ప్రైడ్ క్రింద 1 వేయి 70, పరిశ్రమలు, రవాణా వాహనాల కొనుగోలుకు గానూ 56 కోట్ల రూపాయలను రాయితీగా అందించగా, టి – ఐడియా క్రింద 32 పరిశ్రమల స్థాపనకు గానూ 96 కోట్ల రూపాయలను రాయితీగా అందించాం.

పల్లెల అభివృద్ధి:

ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని సాకారం చేశారు…మన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలన్న…మహాత్మా గాంధీ ఆశయమే స్ఫూర్తిగా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు ‘పల్లెప్రగతి’ కి ప్రాణం పోశారు.నాడు.

దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె, నేడు.దర్జాగా కాలర్ ఎగరేస్తోంది.

సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు ఇవాళ సకల సౌకర్యాలతో వెలిగిపోతోంది.సీఎం కేసీఆర్ సంకల్పంతో.

ప్రతీ పల్లెసీమ.ప్రగతిసీమగా మారింది.ఇవాళ… ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, కంపోస్టు షెడ్డులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.గ్రామానికో ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను సమకూర్చడంతో పాటు పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతను సంతరించుకున్నాయి.

ఫలితంగా తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదర్శ గ్రామాలకు… కేరాఫ్ అడ్రస్ గా, అవార్డుల పంటకు నిలువెత్తు చిరునామాగా నిలుస్తున్నాయి.దేశవ్యాప్తంగా ఇటీవలే నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 సర్వేలో పారిశుద్ధ్య విభాగంలో 5 స్టార్ రేటింగ్ తో రాజన్న సిరిసిల్ల దేశంలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం జిల్లా ప్రజలుగా మనందరికీ గర్వకారణం.

పట్టణ ప్రగతి:

ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, స్వచ్ఛత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మన మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.జిల్లా కేంద్రంగా, కార్మిక కేంద్రంగా ఉన్న సిరిసిల్ల పట్టణంలో గడిచిన 9 ఏండ్లలో లెక్కకు మించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలను పెంపొందించే పనులను వందలాది కోట్ల రూపాయలతో చేపట్టాo.

వ్యవసాయ, వైద్య, సాంకేతికత విద్యా సంస్థలను స్థాపించి ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాం.అనేక రంగాల్లో దేశానికి, రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తోంది.అనేక అవార్డులతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీల్లో 1 లక్ష లోపు జనాభా గల కేటగిరిలో దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా అవార్డు సొంతం చేసుకుంది.2021-22 సంవత్సరంకు గానూ పట్టణ ప్రగతి ఇన్నోవేషన్ అవార్డుల్లో రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్థానం పొందింది.2021-22 సంవత్సరంకు గానూ పీఎం స్వానిధి వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందజేయడంలో మొదటి ట్రెంచ్ లోన్ ల మంజూరులో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, రెండవ ట్రెంచ్ లో రెండవ ర్యాంకు సాధించింది.2021-22 ఆర్థిక సంవత్సరంకు గానూ ఆస్తి పన్ను వసూల్లలో తెలంగాణ లోనే మొదటి ర్యాంకు సాధించింది.ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి, సహకారంతో సిరిసిల్ల పట్టణం రాష్ట్ర, దేశ స్థాయిలో అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంటూ దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.శాంతినగర్ లో 61 కోట్ల రూపాయలతో 6 ఎకరాల స్థలంలో పట్టణం నలుమూలల నుండి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నాం.

సిరిసిల్ల మున్సిపాలిటీకి సమీపంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు 6 కోట్ల రూపాయలతో వెంకటాపూర్ శివారులో ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో 50 హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ పార్కు ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

సిరిసిల్లతో సమాంతరంగా దక్షిణ కాశీగా పేరు గాంచిన ధార్మికక్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తున్నాం.సీఎం అస్సూరెన్స్ నిధులతో 1 కోటి రూపాయలతో వైకుంఠధామంను నిర్మించాం.6 కోట్ల 12 లక్షల రూపాయలతో నిర్మించిన కూరగాయల మార్కెట్, మూలవాగు బండ్ సుందరీకరణ, నంది కమాన్ జంక్షన్ ను ఇటీవలే ప్రారంభించుకున్నాం.4 కోట్ల 50 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి.తుఫిడీసీ ప్రత్యేక నిధులు 20 కోట్ల రూపాయలతో పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంపొందించే పనులు పురోగతిలో ఉన్నాయి.

బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన స్టేజీ, గుడిచెరువు, ట్యాంక్ బండ్, మినీ స్టేడియం, ఫుట్ పాత్ ల అభివృద్ధి, ఇతర జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు, డంప్ యార్డు నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి.వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, ఆలయ ఎలక్ట్రిసిటీ అవసరాలు తీర్చేలా 32 లక్షల రూపాయలతో బయో గ్యాస్ ఆధారిత ఎలక్ర్టిసిటి జనరేషన్ ప్లాంట్ ను ఇటీవలే ప్రారంభించుకున్నాం.

ధరణి:

భూ సంస్కరణల్లో భాగంగా భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు చేరువయ్యాయి.జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు, పెండింగ్ మ్యూటేషన్లు, కోర్టు కేసులు సహా వివిధ కేటగిరీల కింద వచ్చిన మొత్తం 38 వేల 568 దరఖాస్తులకు పరిష్కారం చూపాం.ధరణిలో ప్రజలు 59 వేల 806 స్లాట్లు బుక్ చేసుకోగా 58 వేల 382 లావాదేవీలను పూర్తి చేశాం.

నేతన్నకు చేయూత:

నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రసాయనంగా రంగరించి అద్భుతమైన నాగరికతను మనిషికి నేర్పిన నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి 2 వేల 500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి క్రిస్మస్, రంజాన్ తదితర అనుమతులను ప్రభుత్వం ఇస్తుంది.ఈ ప్రభుత్వ ఆర్డర్ వలన 15 వేల మందికి పైగా కార్మికులు నెలకు ఒక్కొక్కరూ 16 వేలకు పైగా వేతనం పొందుతున్నారు.

సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అపెరల్ పార్క్ పనులు, 88 ఎకరాల స్థలంలో 388 కోట్ల రూపాయలతో చేపట్టిన వీవింగ్ పార్కులలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి.ఇప్పటికే 4 కోట్ల 50 లక్షల రూపాయాలతో గోకుల్దాస్ ఇమేజెస్ పరిశ్రమ స్థాపించబడి 950 మందికి ఉపాధి కల్పిస్తుంది.

ఒకప్పుడు బీడీలు చుట్టిన సిరిసిల్ల మహిళల చేతుల్లో ఇప్పుడు ప్రపంచ శ్రేణి వస్త్రాలు తయారు అవుతున్నాయి.

సిరిసిల్ల అపెరల్ పార్కులోని గోకుల్ దాస్ సంస్థ గ్రీన్ నీడిల్ యూనిట్ లో మహిళలు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వస్త్రాలు సిరిసిల్ల బ్రాండ్ తో అమెరికా ఎగుమతి అవుతున్నాయి.

అపెరల్‌ పార్కు… అతివల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.ఈ అపెరల్ పార్క్ నిర్మాణం పూర్తి అయితే 8 వేల మంది మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనుంది.‘తెలంగాణ చేనేత మగ్గం’ పేరుతో నేతన్నలకు గుంట మగ్గాల స్థానంలో కొత్తగా ఫ్రేమ్‌ మగ్గాలను అందించనున్నాం.

రైతుల మాదిరిగానే నేతన్నలకు బీమా ఇస్తున్నాం.

దీన్ని త్రిఫ్ట్‌ పథకానికి లింక్‌ చేసి 75 ఏండ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుంది.ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60 మంది నేత కార్మికులు, 4 వేల 644 మంది మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా పథకంలో నమోదు చేయడం జరిగింది.అలాగే ఈ పథకంలో నమోదై మరణించిన 10 మంది నేతన్నల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశాం.

ప్రభుత్వ ఉద్యోగులుగా జేపీఎస్‌, వీఆర్‌ఏలు:

ప్రభుత్వ నిర్ణయంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులతో పాటు రెవెన్యూ అసిస్టెంట్లను రెగ్యులర్‌ చేస్తూ అలాట్‌మెంట్‌ ఆర్డర్లను ఇటీవలే అందజేయడం జరిగింది.345 మంది మంది వీఆర్‌ఏలను రెగ్యులరైజేషన్ తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను, 59 మంది జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులను గ్రేడ్‌-4 కార్యదర్శులుగా పోస్టింగ్ ఉత్తర్వులను అందజేయడం జరిగింది.ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు, అలవెన్స్ లు ఈ ఉద్యోగులు పొందనున్నారు.

శాంతి భద్రతలు:

శాంతి సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది.శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాము.

శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీలేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతుంది.ప్రజాభద్రత, ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ చేధనకు పోలీస్ యంత్రాంగం సాంకేతికత ద్వారా సంపూర్ణంగా నియంత్రించడానికి కృషి చేస్తుంది.

డయల్ 100 కి ఫోన్ చేసిన వారికి 5 నిమిషాల వ్యవధిలో సహాయం అందించడం జరుగుతుంది.

జిల్లాలో మహిళల రక్షణార్థం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్ధవంతంగా పనిచేస్తూ మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి.

జిల్లాలో మహిళల భద్రత,రక్షణనే ధ్యేయంగా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ‘ఆపరేషన్ జ్వాల’ (సెల్ఫ్ డిఫెన్స్) కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి ‘బస్ లో భరోసా’ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రయాణికులకు భరోసా కల్పించడం జరుగుతుంది.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్రామ స్థాయిలో మరియు ప్రధాన రహదార్లలో ఉన్న పెట్రోల్ బంక్ లు, దాబాల వద్ద ఉన్న వారితో కలిసి రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలు ఏర్పాటు చేసి 1,500 మందికి ప్రథమ చికిత్స, సిపిఆర్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది.

మాదకద్రవ్యాల నిరోధమే లక్ష్యంగా జిలాలో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల ద్వారా కలిగే అనర్థాలపై చైతన్యం కల్పించడం జరుగుతుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube