రాజన్న సిరిసిల్ల జిల్లా: ఒకటి నుండి 19 సంవత్సరాలలో ప్రతి పిల్లలకు నులి పురుగు నివారణ మాత్రలు వేసి నులి పురుగులను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని జడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు.జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా సిరిసిల్ల పట్టణం గీతా నగర్ ఎంపిపిఎస్ పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ దినోత్సవానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కల చక్రపాణితో కలిసి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆల్బండొజల్ మాత్రలు ఎటువంటి హానీ చేయదన్నారు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బండొజల్ మాత్ర వేయడం వల్ల కడుపులో పెరిగే నట్టలను పూర్తిస్థాయిలో నివారించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ మాత్రల వల్ల పిల్లల్లో వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, బరువు తగ్గడం, కడుపునొప్పి ఇలాంటి వాటిని నివారించవచ్చు అని సూచించారు.ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ప్రతి పిల్లలకి మాత్ర వేసేలా అటు అధికారులు ఇటు తల్లిదండ్రుల చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా మాత్ర వేయించాలని సూచించారు. పిల్లలు ఆరుబయట వట్టి కాళ్ళతో ఆడుకోవడం, మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లాంటి వాటివల్ల నులిపురుగులు తయారవుతాయని అన్నారు.
మాత్రలు పిల్లలకు వేయడం వల్ల రక్తహీనతతో బాధపడే అవకాశం ఉండదన్నారు.అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ విద్యార్థులకు మాత్రలు వేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







