ఏపీలో రాజకీయం( Politics ) వేడెక్కుతోంది.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో బలం పెంచుకునే విషయంపై దృష్టి సారించాయి.
ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో జనాల్లోకి తమ పార్టీ నాయకులు తిరిగేలా చేస్తుండగా, టిడిపి వివిధ ప్రజా సమస్యల పైన ఏదో ఒక పోరాటం చేస్తూనే వస్తుంది.అలాగే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువ గళం పాదయాత్రతో జనాల్లోనే ఉంటున్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు .వైసీపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేస్తున్నారు .ఇక ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి పురందేశ్వరి ( Daggupati Purandeshwari )సైతం వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఏపీ రాజకీయాన్ని మరింత వేడెక్కించే పనిలో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో, 2024లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) మరింత ఆసక్తికరంగా మారాయి.ప్రజానాడిని పసిగట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఈ విధంగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగా, రాబోయే ఎన్నికల్లో సామాజిక వర్గాలు మద్దతు ప్రధానంగా మారింది.
ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీన కాపునాడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నాయకులను ఏకం చేసే విధంగా ఆగస్టు 13న కాకినాడలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.కాపు, తెలగ, బలిజ ఒంటరి కులాలకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నట్లు చెబుతున్నారు.పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులందరినీ ఈ సమావేశానికి పిలుస్తున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన మేధావులు, రాజకీయ నాయకులు ఇలా అంత ఒకే వేదికపై కనిపించబోతున్నారు.దీంతో ఈ కాపునాడు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.ఈ కాపు నాడు సమావేశం లో ఏ తీర్మానాలు చేయబోతున్నారు అనేది ఆస్తికంగా మారింది.కాపు కులానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినా, రాజకీయ తీర్మానాలే ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది.
వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలంతా హాజరు కాబోతూ ఉండడంతో.ఈ కాపునాడు సమావేశం పై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.