దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచిందని, తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ.1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఇక మీదట 4,016 పెన్షన్ ను అందుకుంటారాని, పెంచిన మొత్తం ఈ నెల నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొందన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.