జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఏపీలో వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో పాటు తీవ్ర దుమారం రేపుతున్నాయి.వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసిపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి పొందుతోంది , ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే అంశాలపై పవన్ వివరించే ప్రయత్నం చేయగా, అది పవన్ కి ఇబ్బందికరంగా మారింది.
వాలంటీర్లను కించపరిచే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని వాలంటీర్లు నిన్న , ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.ఏపీలో అతిపెద్ద వ్యవస్థగా ఉన్న వాలంటీర్ల మీద పవన్ చేసిన వ్యాఖ్యలు జనసేనకు నష్టం చేకూర్చే విధంగా కనిపిస్తున్నాయి.
వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు జరుగుతున్నాయి అని, వైసిపి నాయకులకు ప్రజల డేటా చేరిందని, ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని పవన్ చెప్పడం సంచలనంగా మారింది.

ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహిత్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మేధావి వర్గాలు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి.వాలంటీర్లు సంఘ వ్యతిరేక శక్తులు అన్నట్లుగా పవన్ మాటలు ఉండడంతో దీనిపై వివాదం కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఆరాటపడుతున్న టిడిపి( TDP ) ఈ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయింది.ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తోంది.
గతంలో టిడిపి వాలంటీర్ వ్యవస్థ పై అనేక విమర్శలు చేసింది.అయితే ఈ వ్యవస్థ ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్లడంతో టిడిపి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించమని , ఆ వ్యవస్థను కొనసాగిస్తామని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రకటించారు.
అంతేకాదు ఎన్నికల మేనిఫెస్టో లోను చేర్చారు .

ఇప్పుడు అదే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తే టిడిపికి ఎక్కువ నష్టం అని చంద్రబాబు భావిస్తున్నారట.వాలంటీర్లను సమర్థిస్తే పవన్ కు ఆగ్రహం కలుగుతుందని, పోనీ పవన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తే వాలంటీర్ల( volunteers ) ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ విషయంలో పార్టీ నేతలు ఎవరు స్పందించకుండా సైలెంట్ గా ఉండాలని టిడిపి నుంచి ఆదేశాలు వెల్లాయట.దీంతో ఎక్కడికక్కడ టిడిపి నేతలు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు టిడిపిని కూడా ఇరకాటంలో పడేశాయి.







