తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం( Armur Assembly constituency ) నుంచి పోటీ చేయబోతున్నారనే చర్చ మొదలైంది.ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ బలం పెంచుకోవడం, ఇతర పార్టీలలోని బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడం, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) పైన ఆ ప్రభావం కనిపిస్తుండడం, ప్రజల్లోనూ కాంగ్రెస్ పై ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తుండడం తో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కాంగ్రెస్ నేతల్లోనూ కనిపిస్తోంది.దీంతో ఇప్పటి నుంచే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఒక క్లారిటీ కి వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆర్మూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది.దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండడం , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరడం , అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరబోతుండడం వంటివన్నీ ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి.

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.దీంతో ఉత్తర తెలంగాణ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నిజామాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోటీకి దింపాలని ఆలోచనతో ఏఐసిసి పెద్దలు ఉన్నట్లు సమాచారం.ఈ జిల్లాలోని ఆర్మూర్ నియోజక వర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని మీడియా, సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ఆర్మూరు డివిజన్ లో పసుపు రైతులు, ఇతర రైతుల గ్రూపుల్లో ఈ అంశంపై పెద్దగానే చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ తరువాత రైతుల్లో కాంగ్రెస్ పై సానుకూలత పెరగడం, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ప్రకటించడం, కాంగ్రెస్( Congress ) పై రైతుల్లో సానుకూలత ఏర్పడడం వీటన్నిటిని లెక్కలు వేసుకుని కాంగ్రెస్ అధిష్టానం పెద్దల సూచనతో ఆర్మూరు నుంచి పోటీ చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట.

ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆశన్న గారి జీవన్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, బీ ఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత, ఇటీవల కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు నిర్వహించిన సర్వేలోనూ ఆర్మూరు నుంచి రేవంత్ ను పోటీకి దింపితే జిల్లా అంతటా ఆ ప్రభావం కనిపిస్తుందని నివేదిక ఇవ్వడంతో రేవంత్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.