బండి సంజయ్( Bandi Sanjay ) ఇప్పుడు మాజీ అయిపోయారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పార్టీలోను, బిజెపి అధిష్టానం పెద్దలలోను మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ ను కీలకమైన ఎన్నికల సమయంలో తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
సంజయ్ స్థానంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని( Kishan Reddy ) నియమించారు.దీంతో సంజయ్ మాజీ అయ్యారు.
అయితే సంజయ్ మాజీ కావడానికి కారణం ఆయన దూకుడు వ్యవహారమే .ఏ దూకుడు వ్యవహారం కారణంగా ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందో ఇప్పుడు అదే ఆయనకు మైనస్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది.అందులో బీఆర్ఎస్( BRS ) కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ స్థానంలోనూ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ విజయం సాధించారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్( MP Boinapalli Vinod Kumar ) పై బండి సంజయ్ విజయం సాధించడంతో బిజెపిలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.ఆర్ ఎస్ ఎస్ లో శిక్షణ పొందిన సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గాను, కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా నగర్ శాఖ అధ్యక్షుడుగాను పనిచేశారు.
2014 ,2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన 2019లో ఎంపీగా విజయం సాధించారు.2020 మార్చిలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.సంజయ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తెలంగాణలో బిజెపి( BJP ) బాగా బలం పుంజుకుంది.బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు.
అయితే ఈ మధ్యకాలంలో సంజయ్ వ్యవహార శైలిపై సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉండడం, అలాగే పార్టీలో చేరిన ఈటెల రాజేందర్( Etela Rajender ) తదితర నేతలతో సఖ్యతగా వ్యవహరించకపోవడం, చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న రాజేందర్ తో సమన్వయం లేకపోవడం, చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, తరుచుగా తెలంగాణ బిజెపి సీనియర్ నాయకులు బండి సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండడం వంటి కారణాలతో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఓటమి చెందడానికి కారణం బండి సంజయ్ అనే ఫిర్యాదులు సీనియర్ నేతలు చేయడం, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తో సమన్వయం లేకపోవడం, ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Rajasingh ) సస్పెన్షన్ ఎత్తివేతపై క్లారిటీ ఇవ్వకపోవడం, శాసనసభలో బిజెపి పక్ష నేత నియామకం విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరించడం వంటివి ఎన్నో ఫిర్యాదులు అధిష్టానం కు వెళ్లాయి.సంజయ్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్తే బిజెపికి ఓటమి తప్పదనే సంకేతాలు తెలంగాణ బిజెపి సీనియర్లలోనూ వ్యక్తం కావడం వంటివన్నీ సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి కారణం అయ్యాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.