పోడు చేస్తున్న భూములకు అధికారులు సర్వే చేపట్టి రశీదులు సైతం ఇచ్చి వెళ్లారు.కానీ త్వరలో హక్కు పత్రాలను మంజూరు చేస్తున్నట్టుగా విడుదల చేసిన జాబితాలో చాలా మంది గిరిజన రైతుల పేర్లు లేకపోవడాన్ని గమనించి అవాక్కైపోయారు.
దీనికి కారణం తెలుసుకుందామని కారేపల్లి మండలం చిన్నమడం పల్లి గ్రామానికి చెందిన రైతులు రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు.కానీ కారణాలు మాత్రం చెప్పకుండా ఎవరికి వాళ్ళు తప్పించుకుంటూ కలెక్టరేట్ లో వెళ్లి అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు.
శుక్రవారం కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ ను తమ గోడును వినిపిద్దామనుకుంటే అక్కడ అధికారులు అందరూ దశాబ్ది ఉత్సవాల కోసం ఖమ్మం నగరంలో ఉన్నారు.ఎట్టకేలకు తమ దరఖాస్తును బిజెపి ఎస్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్ మరియు ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ ల అధ్యక్షతన డిఆర్ఓ కి ఇచ్చి తమకు హక్కు పత్రాలను అందజేయాలని కోరారు.
తగిన విచారణ చేపట్టి గిరిజన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటానని డిఆర్ఓ హామీ ఇచ్చారు.







