నల్లగొండ జిల్లా:కేతేపల్లి, తిప్పర్తి,మాడుగులపల్లి, వేములపల్లి మండలాల్లో పలు గ్రామాలకు బస్సు సర్వీస్ లేక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.గతంలో సూర్యాపేట( Suryapet ), మిర్యాలగూడ, నల్లగొండ బస్సు డిపోల నుండి మాడుగులపల్లి, ఇందువుల,గుర్రప్పగూడెం, ఆగా మోత్కూర్, చిరుమర్తి,ఎల్లమ్మగూడెం, చెర్కుపల్లి,తుంగతుర్తి, భాగ్యనగరం, ఉప్పలపహాడ్( Uppalapahad ) గ్రామాల మీదుగా బస్సు రాకపోకలు సాగించేవి.
కరోనా సమయంలో ఈ రూట్లో నడిచే ఆర్టీసి బస్సులను రద్దు చేయడంతో అప్పటి నుండి వివిధ గ్రామాల నుండి నిత్యం కళాశాలకు వెళ్లే విద్యార్థులు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎన్నోసార్లు ఆర్టీసీ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ఆర్టీసీ బస్సు( RTC bus ) సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు.
ప్రధానంగా ఈ రూట్లో దాదాపు 20 గ్రామాల నుండి విద్యార్థులు, ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు.ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలపై ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులలో అయితే సురక్షిత ప్రయాణంతో పాటు ఛార్జీల భారం లేకుండా సరైన సమయానికి పట్టణాలకు చేరే వాళ్ళమని,బస్సు సర్వీసులు లేకపోవడంతో ఆటోలపై ఎక్కువ చార్జి వసూలు చేస్తున్నారని, మరోవైపు సమయానికి చేరలేకపోతున్నామని, విద్యార్థులు ప్రయాణికులు అంటున్నారు.ఆర్టీసీ అధికారులు స్పందించి మిర్యాలగూడ, సూర్యాపేట,నల్లగొండ డిపోల నుండి ఈ రూట్లో ఆర్టీసి బస్ సర్వీస్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు.