ఆ పల్లె గురించి నిన్న మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు.కానీ ఇప్పుడా ఆ గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించింది అంటే మీరు నమ్ముతారా? ఓ అధికారికి వచ్చిన ఆలోచన, ప్రయోగానికి.ఆ ఊరు వేదికగా మారింది.హుజురాబాద్( Huzurabad ), పరకాల ప్రధాన రహదారిపై ఉన్న ఉప్పులపల్లి గ్రామపంచాయతీ చేపట్టిన వినూత్న కార్యక్రమం గురించి ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరా తీయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
అవును, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో నిర్మించిన బస్‌షెల్టర్( uppalapalli ) పలువురిని ఆకర్షిస్తోంది.
ఇకపోతే, ఆ గ్రామానికి ఖాళీ నీళ్ల సీసా బాటిల్స్ ఓ సమస్యగా మారాయి.పంచాయతీ సిబ్బంది నిత్యం సేకరించిన సీసాలు సెగ్రిగేషన్ షెడ్డుకు వచ్చి చేరడంతో సర్పంచ్ వీటిని తగ్గించడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు.ఇదే విషయాన్ని ఎంపీడీఓ పల్లవితో చర్చించి వెంటనే యాక్షన్లోకి దిగారు.
ఎంపీడీఓ పల్లవికి వచ్చిన ఆలోచన వల్ల ఇపుడు ఎన్నో ప్రయోజనాలు కలిగాయని గ్రామస్థులు చెప్పడం కొసమెరుపు.గ్రామంలో బస్‌షెల్టర్ నిర్మాణం ఒక్కటే జరగడం కాకుండా.పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఆలోచన ఎంతో దోహదపడిందని కూడా చెబుతున్నారు.
ఇక పర్యావరణ సమతుల్యతకు సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని.అన్ని దేశాలు చర్యలు చేపడుతున్న విషయం విదితమే.ఈ క్రమంలోనే ఇక్కడ వాటర్ బాటిల్స్ భూమికి భారం కాకుండా ప్రయాణీకులకు నీడనిచ్చేవిగా తీర్చిదిద్దడం విశేషం.కేవలం రూ.10,000ల లోపు డబ్బులతో నిర్మించిన ఈ బస్‌స్టాప్ వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గిందని గ్రామ సర్పంచ్, కార్యదర్శి పేర్కొన్నారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం అందించడంతో పాటు పెరిగిపోతున్న ఖాళీ నీళ్ల సీసాల సమస్యను కూడా అధిగమించానన్న సంతృప్తి కలిగిందని గ్రామస్తులు అంటున్నారు.ఇలాంటి మరిన్ని వినూత్న ఆలోచనలతో భవిష్యత్‌లో ముందుకు సాగుతామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.