భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 11న కొత్తగూడెం( Kothagudem ) లో జరగనున్న ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు.గురువారం ఖమ్మం సిపిఐ కార్యాలయం వద్ద ప్రజాగర్జన సభ ప్రచార వాహనాలను సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాగర్జన పేరిట కొత్తగూడెం ప్రకాశం మైదానంలో 11వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఇందు కొరకు గడచిన నెల రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో సమావేశాలను పూర్తి చేసినట్లు హేమంతరావు తెలిపారు.
కరపత్రాలు, గోడ రాతల ద్వారా ప్రచారం నిర్వహించామని చివరి దశలో ప్రతి మండలంలోనూ ప్రజాగర్జన సభ జయప్రదం కోరుతూ ప్రచార వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఖమ్మంజిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రచార యాత్రలు సాగుతాయని హేమంతరావు తెలిపారు.
ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, కె.నారాయణ, అజీజీపాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.







