నల్లగొండ జిల్లా:మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం బ్రాహ్మణ వెల్లంలా రిజర్వాయర్ వద్ద జరిగిన తన 60వ జన్మదిన వేడుకల్లో పాల్గొని రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముందుగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం దగ్గర కృష్ణా జలాలకు పూజలు చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆయన హాజరైన ప్రజలను,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.
కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తనను పదేపదే సీఎం సీఎం అనవద్దని,సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యేగానే నన్ను ఓడిస్తారని, పరోక్షంగా తనకు ప్రత్యర్థి, సొంత పార్టీలోనూ ప్రత్యర్థులు ఉన్నారని చెప్పకనే చెప్పారు.తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలేశానని,తనకు ఏ పదవీ ముఖ్యం కాదని, నాకు ప్రజలే ముఖ్యమని మీకోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమన్నారు.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నన్ను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తన అభిమానాన్ని చాటారని, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు.చనిపోయాక ప్రజలు గుర్తుపెట్టుకునేలా ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.
త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్లు వస్తాయని,కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తనని ఎమ్మెల్యేగా నల్గొండ ప్రజలు ఎలాగూ గెలిపిస్తారని,కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకపోతే, నల్లగొండలో గెలిచినా రాజీనామా చేస్తానన్నారు.