తల్లీదండ్రులు( parents ) పేదవాళ్లు అయినా ధనవంతులు అయినా తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని భావిస్తారు.తమ పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తల్లీదండ్రులు అస్సలు తట్టుకోలేరు.
పిల్లల కోసం రేయింబవళ్లు మరింత కష్టపడి పని చేస్తున్న తల్లీదండ్రులు కోకొల్లలు.అయితే కొడుకు అంత్యక్రియల రోజే కొడుకు పుట్టినరోజు వేడుకలను నిర్వహించడంను మించిన బాధ మరొకటి ఉండదనే సంగతి తెలిసిందే.
తెల్లవారితే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన బాలుడు హఠాన్మరణం చెందడంతో తెలంగాణకు చెందిన ఒక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.కుమురం భీం జిల్లా అసిఫాబాద్ మండలం బాబాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే బాబాపూర్ గ్రామంలోని గుణాంతరావు, లలిత దంపతుల చిన్న కుమారుడు సచిన్ వయస్సు 15 సంవత్సరాలు కాగా సచిన్ గుండెపోటుతో గురువారం రోజున మృతి చెందారు.

శుక్రవారం రోజు సచిన్ పుట్టినరోజు కాగా పుట్టినరోజు జరుపుకోవాల్సిన కొడుకు హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.అయితే శుక్రవారం కొడుకు పుట్టినరోజు కావడంతో ఎంతో బాధ ఉన్నా తల్లీదండ్రులు చనిపోయిన సచిన్ చేతితో కేక్ కట్ చేయించడంతో పాటు గుండెలు పగిలేలా ఏడ్చారు.గురువారం మధ్యాహ్నం సమయంలో కడుపులో మంటగా ఉందని సచిన్ చెప్పగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులు మెరుగైన వైద్యం కోసం సచిన్ ను మంచిర్యాలలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు.చిన్న వయస్సులోనే బాలుడు మృతి చెందడంతో గ్రామ ప్రజలు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
ఆ తల్లీదండ్రులకు వచ్చిన కష్టం పగవాళ్లకు కూడా రాకూడదని కామెంట్లు వినిపిస్తున్నాయి.







