భారతదేశ తూర్పు తీరంలోని కీలక రాష్ట్రం ఒడిషా నుంచి యునైటెడ్ అరబ్ ఎయిరేట్స్ (యూఏఈ)కి విమాన సర్వీసును ప్రారంభించడంపై ఒడిషాకు చెందిన ప్రవాస భారతీయులు( Odisha NRIs ) హర్షం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే.
ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి దుబాయ్‌కి( Dubai ) తొలి విమానం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం రాత్రి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, ఒడిషా ప్రభుత్వాలు ‘‘ ఒడిషా దివస్’’( Odisha Diwas ) పేరుతో వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జీసీసీ దేశాల్లో ( గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్) స్థిరపడిన 1100 మంది ఒడిషా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు.
భువనేశ్వర్‌లోని బిజు పట్నాక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ అనేది యూఏఈలోని ఒడిషా వాసుల చిరకాల స్వప్నం.అయితే వారి కల నెరవేరిన నేపథ్యంలో వీరంతా సంబరాలు జరుపుకున్నారు.
ఈ డైరెక్ట్ ఫ్లైట్ వల్ల ఆర్ధిక అవకాశాలు పెరగడం, సంస్కృతుల మార్పిడి జరుగుతుందని ఎన్ఆర్ఐ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.అలాగే జీసీసీలోని ఒడిషా, ఇతర ప్రవాస భారతీయ కమ్యూనిటీల మధ్య సంబంధాలు బలపడతాయని వారు పేర్కొన్నారు.

కాగా.ఇండిగో సంస్థ ప్రారంభించిన ఈ డైరెక్ట్ ఫ్లైట్ వల్ల యూఏఈలో నివసిస్తున్న దాదాపు 10 వేల మంది ఒడిషా ప్రవాసుల ప్రయాణ కష్టాలకు ముగింపు పలికినట్లయ్యింది.వీరంతా గతంలో భారత్‌లోని మిగిలిన నగరాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా యూఏఈకి చేరుకోవాల్సి రావడంతో అనేక వ్యయ, ప్రయాసలను ఎదుర్కొనేవారు.ఈ నేపథ్యంలో ఒడిషా ఎన్ఆర్ఐలు గట్టి లాబీయింగ్ ద్వారా భువనేశ్వర్ నుంచి దుబాయ్‌కి తొలి అంతర్జాతీయ విమానాన్ని సాధించారు.
జూన్ 2022లో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.తన తొలి యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్-భువనేశ్వర్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌ను ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.

ఇకపోతే.కొత్త విమాన సర్వీసు వారంలో మూడుసార్లు నడుస్తుంది.ఇందుకు గాను వన్ వే ధర 500 దిర్హామ్‌లు. ఒడిషా దివస్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.ఏడాదిలోపే తన హామీని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా వుందన్నారు.ఒడిషాను అంతర్జాతీయ సమాజానికి అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
త్వరలో భువనేశ్వర్ నుంచి సింగపూర్, బ్యాంకాక్‌లకు విమాన సర్వీసులను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.







