నిన్న మొన్నటి వరకు అందరి దృష్టిని ఆకర్షించిన కర్నాటక ఎన్నికలు ఎట్టకేలకు ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలంగాణపై పడింది.తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
దాంతో ఇప్పటి నుంచే తెలంగాణపై పట్టు సాధించేందుకు అన్నీ ప్రధాన పార్టీలు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి.ముఖ్యంగా జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని దృఢ సంకల్పంతో ఉన్నాయి.
ముఖ్యంగా తెలంగాణపై ఈసారి కాంగ్రెస్ గట్టిగానే దృష్టి సారించింది.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అనే నినాదంతో ఈసారి ప్రజల్లోకి గట్టిగా వెళ్లాలని హస్తం నేతలు పట్టుదలగా ఉన్నారు.

హైకమాండ్ కూడా తెలంగాణ విషయంలో టి కాంగ్రెస్ ( Telangana Congress )నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మద్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నేతలందరు పార్టీ కోసం కలిసిమెలిసి పని చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ ప్రజలను ఆకర్శించేందుకు సరికొత్త విధంగా ప్రణాళికలు రచిస్తూ పోలిటికల్ హీట్ ను పెంచుతోంది.ముఖ్యంగా డిక్లరేషన్లు అంటూ నానా హడావిడి చేస్తోంది.
ఇటీవల హైదరబాద్ వచ్చిన ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై నిరుద్యోగులకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు.ఇక ఆ మద్య రైతు డిక్లరేషన్ అంటూ టి కాంగ్రెస్ నేతలు హడావిడి చేశారు.

ఇదిలా ఉంచితే సెప్టెంబర్ 17 న ఏకంగా కాంగ్రెస్ మేనిఫెస్టోనే ప్రకటిస్తామని, ఈ లోపు ఓబీసీ, మైనారిటీ, మహిళా డిక్లరేషన్స్ కు కూడా వెల్లడిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు.దీన్ని బట్టి చూస్తే ఎన్నికలకు హస్తం పార్టీ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఎన్నికల మూడ్ లోకి ముందే వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో విజయం దక్కుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ( Brs party )ను మాత్రమే కాకుండా వేగంగా పుంజుకున్న బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది.
దాంతో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎన్నికల్లో నెట్టుకురావడం కష్టమనేది కొందరి అభిప్రాయం.మరి ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిన హస్తం నేతలు ఇదే జోష్ ఎంతవరకు కొనసాగిస్తారో చూడాలి.







