సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో గల సువెన్ ఫార్మా కంపెనీ( Suven Pharma Company ) సీజ్ చేయాలని సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక విక్రమ్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం కోటి రూపాయలతో సువేన్ కంపెనీ మొదలుపెట్టి వేల కోట్లు సంపాదించి అనేక చోట్లకు కంపెనీని విస్తరించిందన్నారు.
నాడు కంపెనీ కోసం అతి తక్కువ ధరకు భూములు ఇచ్చిన గిరిజన రైతులను పట్టించుకోకుండా 6,500 కోట్లకు కంపెనీని వేరే వాళ్లకు అమ్ముకొని ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు.ఇక్కడ ఉన్న ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి భూమి కాలుష్యం,నీటి కాలుష్యం,వాయు కాలుష్యంతో సతమతమవుతూ అనారోగ్యాల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోకుండా ఉంటూ, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని డబ్బుతో కొని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అండదండలతో నడిపిస్తున్నారని విమర్శించారు.గత 6 నెలల క్రితం తమ పార్టీ ఆధ్వర్యంలో సెవెన్ ఫార్మసీ ని సీజ్ చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేసినా కానీ ఈరోజు వరకు ఎవరు పట్టించుకోలేదని వాపోయారు.
కంపెనీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రులపాలు అవుతున్న పట్టించుకోవడం లేదన్నారు.అదే కంపెనీలో మరో కొత్త బ్లాకును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారని,దీనికి 2018 లో అధికారులు కొంతమందికి డబ్బు ఆశ చూపించి దొంగ సంతకాలు పెట్టించి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా బ్లాకుని ప్రారంభించాలని చూస్తున్నారని వెల్లడించారు.
నిజానికి ఆ బ్లాక్ ప్రారంభిస్తే గనుక ఆ బ్లాక్ బ్లాస్ట్ అయితే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇల్లు మొత్తం కుప్పకూలిపోయి ప్రజలు అనేకమంది ప్రాణాలు కోల్పోతారని వివరించారు.కావున ప్రభుత్వం కలగజేసుకొని సువేన్ ఫార్మసీనీ సీజ్ చేయాలని తమ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల సీజ్ చేసే వరకు పోరాటాలు ఆపేది లేదని హెచ్చరించారు.
తమ పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక( Kothapalli Renuka ),పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్,పార్టీ జిల్లా నాయకులు నాగన్న, నరసన్న,ఐఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి రామోజీ, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సూరవు రేణుక,శైలజ,పద్మ, పిడిఎస్ యు నాయకులు సింహాద్రి,పివైఎల్ జిల్లా నాయకులు పరుశురాం, సునీల్,జీవన్ తదితరులు పాల్గొన్నారు.