యాదాద్రి భువనగిరి జిల్లా:సీపీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటికి 48వ రోజుకు చేరుకుంది.బుధవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న అనంతరం పాదయాత్రగా ముందుకు సాగారు.
ఈ నేపథ్యంలో గత 405 రోజులు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవర్లు సీఎల్పీ నేత వద్ద తమ కష్టాలను ఏకరువుపెడుతూ బాధలను చెప్పుకున్నారు.యాదగిరిగుట్ట ఆలయాన్ని ప్రారంభించిన మరుసటి రోజునుంచి కొండపైకి ఆటోల రాకపోకలను ఈ ప్రభుత్వం నిషేధించిందని దీనివల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోలను కొండ పైకి అనుమతించేలా చేయాలని ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు మొగులయ్య,సంతోష్, సత్యానారాయణ,ఇతర డ్రైవర్లంతా కలిసి భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కొండపైకి భక్తులను తీసుకెళ్లడంతో పాటు ఆలయ నిర్మాణ సమయంలోనూ అర్చకులకు పూర్తిగా సేవలందించామని చెప్పారు.
ఆటోలను కొండపై వెళ్లకుండా ఇనషేధించడం వల్ల పుస్తెలతాడు పెట్టి కొనుక్కున్న ఆటోలకు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు.పిల్లల స్కూలు ఫీజులు,ఇంటి కిరాయి కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ మీ సమస్యపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రభుత్వం దున్నపోతులాంటిదని దీనిని శూలాలు పెట్టి పొడిచినా ఫలితం రాదన్నారు.
మీ సమస్యపై ఈ ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నానని అన్నారు.ఈ దున్నపోతు ప్రభుత్వం స్పందించక పోయినా వచ్చే ఆరునెలల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో మీ సమస్య పరిష్కరిస్తామని, మీ ఆటోలను తిరిగి కొండపైకి వెళ్లేలా అనుమతిస్తామని భరోసా కల్పించారు.
సీఎల్పీ నేత ప్రకటించిన సంఘీభావం, హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.







