రాజన్న సిరిసిల్ల జిల్లా తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని, పుస్తకాలను శ్రద్ధతో, ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కె.వి.రమణాచారి( Dr.K.V.Ramanachari ) అన్నారు.సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఫుల్ బ్రైట్ గ్లోబల్ టీచర్ గ్రాంట్ ప్రొజెక్ట్ (అమెరికా ) వారి సహకారంతో సోమవారం నుండి ఈ నెల 7 వ తేదీ వరకు నిర్వహించనున్న చదువుల పండుగ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులపాటు 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత, పుస్తక పఠనం,ఆకర్షణీయమైన చేతిరాత, విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసము, నీతి కథలు, ఆంగ్లంపై స్వగ్రామమైన నారాయణపూర్ గ్రామంలో విద్యార్థులు, గ్రామస్థులతో మమేకమై తమ అనుభవాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.నాలుగు గోడల మధ్య గల తరగతి గది పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సమయం ఎంతో విలువైనది, ముఖ్యమైనదని, విద్యార్థులు ఏ సమయంలో చేయాల్సిన పని అదే సమయంలో చేయాలని, గడిచిన సమయం తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.గొప్ప సాహితీ వేత్తలను, ఉపాధ్యాయులను, ఇతర ఉద్యోగులను అందించిన గడ్డ నారాయణపూర్ అని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామానికి దక్కని ఖ్యాతి, గౌరవం నారాయణపూర్ గ్రామానికి దక్కిందని తెలిపారు.
విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలతో పాటు, గొప్ప వారి జీవిత చరిత్రలను, ఇతర కథల పుస్తకాలను చదవాలని అన్నారు.ప్రస్తుతం విద్యార్థుల చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తుందని, తాము చదువుకున్న రోజుల్లో ఈ సౌకర్యాలు లేవని చెప్పారు.
ధనంతో పాటు ధర్మంగా ఉండాలి అనే విషయం విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.
గ్రామానికి గ్రంథాలయం అవసరమని, గ్రంథాలయం నిర్మాణానికి వ్యక్తిగతంగా సహకరిస్తానని తెలిపారు.
ఈ అకాడమిక్ సంవత్సరం ప్రారంభించేలోగా గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.అలాగే వచ్చే సంవత్సరంలో పదవ తరగతిలో 70 శాతం కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులకు నగదు పారితోషికం ఇస్తానని తెలిపారు.
బహుభాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత నలిమెల భాస్కర్ మాట్లాడుతూ చదువు ఒకటే విలువలతో కూడిన జీవితాన్ని అందిస్తుందని, అందరూ సమయాన్ని సద్వినియోగ చేసుకుని, బాగా చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తిరుమల శ్రీనివాసచార్యులు, జిల్లా విద్యాధికారి ఎ.రమేష్ కుమార్, తహశీల్దార్ జయంత్, ఎంపీడీఓ చిరంజీవి, సర్పంచ్ లక్ష్మి నారాయణ, ఎంపీటీసీ అపెరా సుల్తానా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.కృష్ణహరి, తదితరులు పాల్గొన్నారు
.