సూర్యాపేట జిల్లా:అమిత్ షా కేంద్ర హోం మంత్రి పదవిలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన మునగాల,కోదాడ మండలాల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేవెళ్లలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.
ముస్లింల రిజర్వేషన్లు తొలగించే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నట్లు రిజర్వేషన్లు కేవలం సామాజిక వెనకబాటుతనం ప్రాతిపదికనే కల్పించారని మత ప్రాతిపదికన కాదని అమిత్ షా తెలుసుకోవాలన్నారు.న్యాయస్థానం పరిశీలనలో ఉన్న రిజర్వేషన్ అంశంపై అమిత్ షా వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనే విషయం కేంద్ర హోంమంత్రికి తెలియదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు బాధ్యతరాహిత్యమైనవని అన్నారు.భారతదేశంలోని ముస్లింలు ఎస్సీ,ఎస్టీల కన్నా దారిద్ర్యరేఖకు కింద జీవిస్తున్నారని,ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గతంలో నియమించిన కమిషన్లు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు.
గుజరాత్,యూపీ వంటి రాష్ట్రాలలో హిందూ ముస్లిం పేరుతో అమలు చేస్తూ వస్తున్న సమాజ విభజన మంచిది కాదన్నారు.ముస్లిం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచేంతవరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ,జిల్లా అధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా నాయకులు కొమ్ముజడ రామారావు, గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి,ముస్లిం నాయకులు షేక్ ఖాజా,జమీల్,నన్నిబీ, జై బున్,రహిమ తదితరులు పాల్గొన్నారు
.