తన కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గం పై టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కుప్పం నియోజకవర్గం ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లడం, 2024 లో తనను ఓడించడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కి బాధ్యతలు అప్పగించడం పైన బాబు అలర్ట్ అయ్యారు.
ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేయగలిగింది.

అలాగే ఈ నియోజకవర్గంలో కీలకమైన టిడిపి నాయకులను ఎంతోమందిని భయపెట్టి, బుజ్జగించి వైసిపి( YCP )లో చేర్చుకోవడం, తన గెలుపు అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యూహాలు పన్నుతూ ఉండడంపై చాలాకాలంగా బాబు ఆందోళనతోనే ఉంటూ వచ్చారు.అయితే ఈ మధ్యకాలంలో కుప్పం పై వైసిపి ఫోకస్ తగ్గించడంతో పాటు , మిగతా విషయాల్లో వైసిపి ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.దీంతో ఈ నియోజకవర్గంలో మరింత పట్టు సాధించే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

కుప్పం నియోజకవర్గం ( Kuppam constituency )నుంచి ఏడుసార్లు వరుసగా బాబు విజయం సాధించారు .మరోసారి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.అలాగే ఈసారి జరగబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీని సాధించాలని లక్ష్యాన్ని బాబు పెట్టుకున్నారు.దీనిలో భాగంగానే టిడిపి నేతలతో ఆయన అనేక కమిటీలను ఏర్పాటు చేశారు.సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.34 మందితో ఏర్పాటు అయిన సమన్వయ కమిటీ అన్ని కమిటీలను సమన్వయం చేసే విధంగా ఏర్పాటు చేశారు .

ఈ సమన్వయ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ , నియోజకవర్గ ఇన్చార్జి మునిరత్నం, కన్వీనర్ గా ఆర్ చంద్రశేఖర్ ను సభ్యులుగా మరో 31 మందిని నియమించారు.ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అంచనా వేస్తూ, వైసిపి కి ఈ నియోజకవర్గంలో ఆదరణ పెరగకుండా ఏం చేయాలనే విషయాలపైన ఈ సమన్వయ కమిటీ అనేక నిర్ణయాలు తీసుకోబోతోంది.ఇక రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని గెలిపించడంతో పాటు, కుప్పంలోనూ భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారట.







