రైల్వేలో TC ఉద్యోగం( TC Job in Railways ) ఇప్పిస్తామని అమాయక మాటలు చెప్పి భారీ మొత్తంలో డబ్బులు కాజేసి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకెళితే ఉండవెల్లి మండలం మారమునగాల -1 గ్రామంలో సుంకేసులు, లక్ష్మీదేవి ( Sunkesulu ,Lakshmi Devi )అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.వీరి చిన్న కుమారుడు శివకుమార్( Sivakumar ) కు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని తక్కశిలకు చెందిన సాయి కార్తీక్, రామ్మోహన్, కర్నూలుకు చెందిన పి.వెంకటేశ్ లు రూ.14 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని, మొదటగా రూ.140000 చెల్లించుకున్నారు.రెండవసారి ఏడు లక్షలు చెల్లించుకొని ప్రాంసరీ బాండు పై సంతకాలు చేశారు.
ఇక మిగిలిన డబ్బులు ఉద్యోగం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.

తరువాత సాయి కార్తీక్, రామ్మోహన్( Sai Karthik, Rammohan ) లు మిగిలిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగం వచ్చాక మొత్తం ఒకేసారి చెల్లిస్తామని చెప్పినా వినకపోవడంతో 2022 మార్చిలో అల్లంపూర్ చౌరస్తాలో ఉండే ప్లాటు ను సాయి కార్తీక్ పేరు పై తాకట్టు రిజిస్ట్రేషన్ చేశారు.ఇక డబ్బులు మొత్తం తీసుకున్నాక మొదట కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం చేయాలని.
తరువాత ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని చెప్పి గుంటూరు జిల్లాలోని నల్లపాడు రైల్వేస్టేషన్లో అవుట్ సోర్స్ ఉద్యోగం ఇప్పించారు.

ఇక ఉద్యోగంలో చేరిన మొదటి నెలలో రూ.29000, రెండవ నెలలో రూ.18000 రూపాయలు శివకుమార్ బ్యాంక్ అకౌంట్లో వేశారు.అంతేకాకుండా డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మరో మూడు లక్షలు తీసుకొని, శివ కుమార్ తో 20 రూపాయల ఖాళీ ప్రాంసరీ నోటు పై సంతకం చేయించుకున్నారు.డబ్బులు ఇచ్చి మూడు నెలలు కావస్తున్న ఉద్యోగం మాత్రం రాలేదు.
ప్రతిసారి రెండు నెలలు, మూడు నెలలు అంటూ కాలం వెళ్లదీశారు.
తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు తమ వద్ద డబ్బులు తీసుకొని, ఫ్లాట్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని శివకుమార్ కుటుంబ సభ్యులకు కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.
ఈ నోటీసులు చూసిన శివకుమార్ కుటుంబ సభ్యులు తాము మోసపోయామని గ్రహించి ఉండవల్లి మండల ఎస్సై బాలరాజుకు ఫిర్యాదు చేశారు.మోసాన్ని జీర్ణించుకోలేకపోయిన శివకుమార్ తండ్రి సుంకేసులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.







