యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు పరీక్షలు నిర్వహించడం చేతకాదు,పేపర్లు దిద్దడం రాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డివిమర్శించారు.జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో రాహుల్ గాంధీ అనర్హత,టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్,రైతులకు నష్టపరిహారం అంశాలపై మంగళవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…2019 ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఫ్లోలో మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించి అనలేదని,ప్రచార సభలలో దేశంలో జరుగుతున్న సంఘటనలను ఉదాహరణగా చెప్పారని,దీనిపై కిందిస్థాయి కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించిందని,వెంటనే బెయిల్ ఇచ్చి పైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు.గతంలో ఎంతో మందికి కింది కోర్టులో శిక్ష పడితే పైకోర్టుల్లో స్టే తెచ్చుకున్నారని,కోర్టు సమయం ఇచ్చినా లోక్ సభ సచివాలయం తొందరపడిందని,నెల ఆగితే పోయేదేముందని అన్నారు.24 గంటలలోపే అనర్హత వేటు వేశారని అవేదన వ్యక్తం చేశారు.
దేశం కోసం తండ్రిని, నాయనమ్మను కోల్పోయిన రాహుల్ గాంధీ,దేశం ఐక్యత కోసం కష్టపడుతున్న వ్యక్తి అని, జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి,నాలుగోసారి ఎంపీగా ఉన్న వ్యక్తిని డిస్ క్వాలిఫై చేయడం చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు.
రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని,న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.ఏప్రిల్ చివరి వరకు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని, ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని,నేను కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని,కానీ,భువనిగిరిలో కార్యక్రమాల వల్ల వెళ్లలేదన్నారు.దేశ ప్రజలందరూ రాహుల్ పై అనర్హతను ముక్తకంఠంతో ఖండించి,రాహుల్ గాంధీకి సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం వెంటనే అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ తో నిరుద్యోగులకు అన్యాయం చేశారని,9 ఏళ్లుగా 70వేల టీచర్ల పోస్టులు ఖాళీ అయితే డిఎస్సీ నోటిఫికేషన్ లేదని, ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారి అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలో ప్రతీ రెండేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్లమని,10వేల పోస్టులు ఖాళీ అవ్వగానే ఇచ్చామని గుర్తు చేశారు.

డీఎస్సీకి సంబంధించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని,గతంలో ఇంటర్ పరీక్షల స్కాంకు పాల్పడ్డ గ్లోబరేనా సంస్థకే గ్రూప్స్ పరీక్షలు అప్పజెప్పారని,ఈ సంస్థ వల్ల ఎంతోమంది విద్యార్థుల చావుకు గురయ్యారని మండిపడ్డారు.ఈరోజు అలాంటి సంస్థకే అంతా అప్పజెప్పి 30 లక్షల మంది పిల్లల భవిష్యత్ ను నాశనం చేశారని అన్నారు.కనీసం పేపర్లు దిద్దడం కూడా ఈ ప్రభుత్వానికి రాదన్నారు.
ఖాళీ పోస్టులు భర్తీ చేయడం రాక 6 వేల స్కూళ్లు మూతబడ్డాయని, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీని భర్తీ చేయడం రాదని దుయ్యబట్టారు.పేపర్ లీకేజ్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని,దీనిపై హోమంత్రిని కలవబోతున్నామని చెప్పరు.
టీఎస్సీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఆఫీసర్ గా మంచి పేరున్నా,ఇప్పుడు ఆ పరువంతా పోయిందని, స్వచ్ఛందంగా రాజీనామా చేసి,జరిగింది జరిగినట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.కొద్దిపాటి పోస్టులను కూడా భర్తీ చేయలేరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
వడగళ్ల వానకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయని, నాశనమైన పంటలను పరిశీలించి దీక్షలు చేశామని,ఆ తర్వాత సీఎం ఎకరానికి 10వేలు ప్రకటించారని,అది రైతుకు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడిస్తున్నారని,6 గంటలు కూడా రావడం లేదని,ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బా కొట్టుకున్నారని అన్నారు.భువనగిరి చుట్టుపక్కల 6,7 గంటలకు మించి వస్తుందా? రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేదని తెలిపారు.తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని,అందుకే అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారని, ఉద్యోగ భర్యాభర్తలు వేర్వేరు చోట్ల ఉంటున్నారని,దీనిపై ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని వాపోయారు.థాక్రే నేతృత్వంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని,టికెట్ల విషయంలో సర్వే చేయించి ఇస్తారని, రాహుల్ గాంధీ అంశంతోపాటు ఇతర ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తూనే ఉంటామని చెప్పారు.







