సమాజంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి.అనవసర కారణాలవల్ల కుటుంబ సభ్యుల చేతులలోనే ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అదనపు కట్నం కోసం ఓ భర్త భార్యను గొడ్డలితో నరికి, 2నెలల పసి బిడ్డను నీటి సంపులో ముంచి హత్య చేసిన సంఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం అనాజ్ పూర్ ( Anaj Pur ) చెందిన ఏర్పుల ధనరాజ్( Dhanraj ) కు బండరావిరాలకు చెందిన కందికంటి నర్సింగ్ రావు ( Nursing Rao )పెద్ద కూతురు లావణ్య కు 2018లో వివాహం జరిగింది.
వీరికి రెండున్నర సంవత్సరాల కూతురు ఆద్య, 2 నెలల వయసున్న కుమారుడు క్రియాన్స్( Creans ) సంతానం.వివాహం తర్వాత కొంతకాలం బాగానే ఉన్న ధనరాజ్ అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు.
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు.కుమారుడు క్రియాన్స్ జన్మించినప్పటి నుండి లావణ్య పుట్టింటిలోనే ఉంది.

అయితే కుమారుడికి టీకా వేయించాలి అనే నెపంతో లావణ్యను ఇంటికి తీసుకొచ్చాడు ధనరాజ్.బుధవారం రోజు కూడా ఇద్దరి మధ్య అదనపు కట్నం గురించి గొడవ జరిగింది.కోపంతో ఊగిపోతున్న ధనరాజ్ క్షణికావేశంలో పక్కనే ఉన్న గొడ్డలితో లావణ్యను నరికి చంపేశాడు.అలాగే తన రెండు నెలల కుమారుడిని నీటి సంపులో ముంచి చంపేశాడు.తల్లిదండ్రులు పడుతున్న గొడవను చూసి భయపడి కూతురు ఆద్య ఏడుస్తూ బయటకు పరిగెత్తడంతో చుట్టుపక్కల వారంతా ఏమైందని వచ్చి చూస్తే రక్తపు మడుగులో లావణ్య, పంపులో క్రియాన్స్ శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.అయితే చుట్టుపక్కల వారు వస్తున్న విషయం గమనించి ధనరాజ్ పారిపోయాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతుదేహాలను పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అదనపు కట్నం కోసమే ఈ హత్యలు జరిగాయని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.







