జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశా మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఎల్.వెంకట్రావు జిల్లాలో అమలవుతున్న వైద్య మరియు ఆరోగ్య కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో అర్హులైన వారిని గుర్తించి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు,ప్రెస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వవలసినదిగా ఆదేశించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఘనంగా నిర్వహించిన మహిళా ఆరోగ్య కార్యక్రమంపై సమీక్షించి ప్రతి మంగళవారము జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలు నిర్దేశించిన ఎనిమిది ఆరోగ్య సమస్యలపై అవగాహన మరియు సేవలు పొందాలని సూచించారు.
జిల్లాలో నూతనంగా నిర్మించే ఆరోగ్య ఉప కేంద్రాలు, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,వాటి మరమ్మతులపై సమీక్షించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.గుండెపోటు నివారణకు వైద్య ఆరోగ్య సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ మరియు పోలీసు సిబ్బందికి సిపిఆర్ పై తక్షణమే శిక్షణ ఇవ్వాలనిఅన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచాలని,ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న సిజేరియన్ సెక్షన్లను ఆడిట్ చేసి నివారించాలన్నారు.చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించాలని మరియు పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి వారిలో ఉన్న లోపాలను గుర్తించి తక్షణమే సేవలు అందించాలన్నారు.
జిల్లాలో క్షయ వ్యాధు గ్రస్తులు పెరుగుతున్నందున ప్రత్యేక శ్రద్ధ వహించి లక్షణాలున్న వారిని పరీక్షించి టీవీ వ్యాధిని నివారించాలని, వారికి అందజేస్తున్న ప్రోత్సాహకాలు వెంటనే బదిలీ చేయాలన్నారు.బిపి,మధుమేహం మరియు క్యాన్సర్ పరీక్షలు ఇంటింటికి వెళ్లి నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి తక్షణమే అవసరమైన మందులు అందజేయాలన్నారు.
దోమల ద్వారా వ్యాపించు వ్యాధులు మలేరియా, డెంగి,చికన్య,ఫైలేరియాలపై సమీక్ష నిర్వహించి, మరియు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అందుతున్న సేవలు అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ అందిస్తున్న సేవలపై సమీక్షించారు.ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు వైద్య సేవలు అందించాలని,సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి,జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు,ప్రోగ్రాం అధికారులు,ఉప జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ఆర్బీఎస్కే డాక్టర్లు పాల్గొన్నారు.