యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామవరం మండలం మర్యాల గ్రామం,లక్ష్మీతండా పరిధిలో గల ధీరావత్ భిక్షపతికి చెందిన ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒరిస్సా వలస కార్మికుడు టను సబర్ (38) తండ్రి బీబర్ సబీర్ బుధవారం మృతి చెందాడు.ఇటుక బట్టి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సబర్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.
మృతదేహాన్ని పంచనామా నిమిత్తం భువనగిరి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి,అనంతరం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండడంతో మృతుడి కుటుంబ సభ్యులకు ఇటిక బట్టి యాజమాన్యాలకు మధ్య వాగ్వవాదం చోటుచేసుకుంది.దీనిని కవరేజ్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులపైకి ఇటుక బట్టి యాజమాన్యాల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇటుక బట్టి యాజమాన్యాలు ఒక మాఫియాగా ప్రవర్తిస్తూ విధుల్లో భాగంగా వెళ్లిన రిపోర్టర్లపై దాడికి పాల్పడడాని టియూడబ్ల్యూజే -143 నేతలు తీవ్రంగా ఖండించారు.జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై అధికారులు దాడులు నిర్వహించి బట్టీలను నిర్మూలించాలని డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటున్న రిపోర్టర్లపై దాడికి పాల్పడుతున్న ఇటుక బట్టీల మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ నమోదు చేయాలని,లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.