ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడే పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు అని మనం వినే ఉంటాం.ప్రస్తుత కాలంలో అర్థరాత్రి కాదు, పట్ట పగలే రోడ్డుపై ఒంటరిగా వెళ్లలేని దారుణమైన పరిస్థితులలో సమాజం ఉంది.
ఎన్ని చట్టాలు మారినా.ఎన్ని శిక్షలు పడినా ఆడవారికి సంరక్షణ అనేది లేకుండా పోయింది.
ఆకతాయిల తీరు లో ఎటు వంటి మార్పు లేదు.భర్తతో కలిసి షాపింగ్ చేసి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతి పై కొందరు ఆకతాయిలు, భర్తను గాయపరచి యువతి వస్త్రాలు చింపి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

వివరాల్లో కెళ్తే పూర్ణ మార్కెట్ లో కొన్ని సంవత్సరాలుగా ఒక కుటుంబం నివాసం ఉంటుంది.ఈ నెల 15న తమ ఆరేళ్ల కూతురుతో కలిసి షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా గంజాయి సేవించి మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వీరిని ఫాలో అయ్యారు.తమ ఆరేళ్ల చిన్నారి వద్దకు వచ్చి గట్టిగా హారన్ కొట్టడంతో, ఆ చిన్నారి తండ్రి ఆ యువకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు మరింత రెచ్చిపోయి భర్తను గాయపరిచి, భార్య వస్త్రాలు చింపి చాలా అసభ్యంగా ప్రవర్తించారు.దీనితో ఆ యువతి తన సోదరుడికి ఫోన్ చేసి రప్పించగా, అతనిపై కూడా తీవ్రంగా దాడి చేసి గాయపరచారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఆ ప్రాంతం లోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టగా, సంపత్, వీర్రాజును నిందితులుగా గుర్తించారు.అయితే పరారీలో ఉన్న సంపత్, వీర్రాజు లకోసం పోలీసులు ముంబరంగ గాలిస్తున్నారు.








