ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులకు మూడో విడతలో అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం వినతిపత్రం అందజేశారు.సోమవారం నూతన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అర్హులైన వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ స్పందిస్తూ.త్వరలోనే అక్రిడిటేషన్ కమిటీని సమావేశపరిచి అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన విధి విధానాలను తయారుచేసి సిద్ధంగా ఉంచాలని అక్కడే ఉన్న డిపిఆర్ఓ గౌస్ పాషాను ఆదేశించారు.
అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందజేసి జర్నలిస్టుల కుటుంబాలలో వెలుగులు నింపాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.దీంతో కలెక్టర్ స్పందిస్తూ.
త్వరలోనే జర్నలిస్టుల కలలు నెరవేరబోతాయని, దానికి సంబంధించిన కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… త్వరలోనే జర్నలిస్టుల కల నెరవేరబోతుందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, ఇతర ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వీటి కార్యాచరణ అమలు జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆకుతోట ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు.మూడో విడత అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు (ఐజేయు) వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, టీఎస్ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వి రామకృష్ణ, సహాయ కార్యదర్శి షేక్ జానీ పాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, మహిళా ప్రతినిధి వంగూరు ఈశ్వరి, నాయకులు వడ్డే రామారావు, మోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు







