వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆచి తూచి వ్యవహరిస్తూ ఉంటారు.ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని ఒక ఉప సంహరించుకుంటే జరిగే నష్టాలు ఏమిటో జగన్ కు బాగా తెలుసు.
కానీ అన్నీ తెలిసినా, చాలా విషయాల్లో తన నిర్ణయాలను జగన్ మార్చుకోవాల్సి వస్తుంది.ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.
దానికనుగుణంగా ఎన్నో జీవోలను తీసుకొచ్చారు.

దీనిపై ఎక్కడా ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.కోర్టులు తప్పు పడితే తప్ప, ఆ నిర్ణయాలను మార్చుకునేందుకు జగన్ ఇష్టపడరు.తాజాగా ఓ జీవో విషయంలో జనాల నుంచి, వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత , ఒత్తిడి వస్తుండడంతో, చివరకు ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది .
విషయానికి వస్తే పట్టణ , నగర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు వేసే లేఔట్ ల మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం స్థలాన్ని పేదల ఇళ్ళ నిర్మాణానికి కేటాయించాలంటూ 2021 డిసెంబర్ 6 ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 145 ను తీసుకొచ్చింది.దీంతో ఈ జీవోపై వ్యతిరేకత వ్యక్తం అయింది.
దీని కారణంగా లేఔట్లు వేయడం బాగా తగ్గిపోయింది.ప్రభుత్వానికి ఈ లేఔట్ ల ద్వారా వచ్చే ఆదాయము గణనీయంగా తగ్గిపోవడం, తాము వ్యాపారం కోసం లేఔట్లు వేస్తుంటే, ఎప్పుడూ ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం ఐదు శాతం స్థలాన్ని తీసుకోవడం ఏమిటంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఒత్తిడి, వ్యతిరేకత రావడం,

అలాగే ఈ ఐదు శాతం స్థలం కు అయ్యే ధరను అక్కడ లేఅవుట్లు కొనుగోలు చేసిన వినియోగదారులపై వేస్తుండడం వంటి వాటితో ఈ జీవోపై వ్యతిరేకత పెరిగిపోతుండడం , సరైన అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందనే ఆరోపణలు రావడం తదితర వ్యవహారాలన్నిటిని సీరియస్ గా పరిశీలించిన ఏపీ ప్రభుత్వం తాము జారీ చేసిన జీవో నెంబర్ 145 వెనక్కి తీసుకుంది.అంతకంటే ముందుగా ఈ జోవో ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఈ జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లుగా మున్సిపల్ శాఖ పేర్కొంది.దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.







