టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ అంతటా పాదయాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈనెల 27వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కాబోతోంది.
దాదాపు 4000 కిలోమీటర్ల దూరం ను 400 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నారు.రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడుతుందని , గతంలోనూ ఎన్నికల ముందు పాదయాత్ర నిర్వహించిన వారంతా అధికారంలోకి రావడంతో, అదే రూట్ ను లోకేష్ ఎంచుకున్నారు.
ఈ పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా టిడిపి తీసుకుంది.ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రభావం మరింత పెరగడంతో పాటు , టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్ర బాగా దోహదపడుతుందని చంద్రబాబు సైతం బలంగా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ అధికార పార్టీ వైసిపి ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు రకరకాల అవాంతరాలు సృష్టిస్తుందని అంత భావిస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే ఏపీ మంత్రి మేరుగా నాగార్జున ఈ యాత్రపై స్పందించారు.పాదయాత్రను నిలిపివేస్తామని ? లోకేష్ ఎలా తిరుగుతారో చూస్తాం అంటూ ఆయన ప్రశ్నించారు.అయితే గతంలో టిడిపి అధికారంలో ఉండగా జగన్ పాదయాత్ర చేశారని , అప్పుడు తాము ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని, ఇప్పుడు తమ పాదయాత్రను ఎలా అడ్డుకుంటారంటూ టిడిపి విమర్శలు చేస్తోంది .మంత్రి నాగార్జున తరువాత ఈ పాదయాత్ర పై వైసీపీ నేతలు ఎవరూ విమర్శలు చేయలేదు.దీనికి కారణం జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లడమేనట.లోకేష్ పాదయాత్ర కు అడ్డంకులు సృష్టిస్తామని ఎవరు ప్రకటనలు చేయవద్దని, పాదయాత్ర అంశాన్ని ఎవరు పట్టించుకోవద్దని, నిబంధనల ప్రకారం నడుచుకుంటే పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని జగన్ ఆదేశించారట.

గతంలో తాను పాదయాత్ర నిర్వహించిన అనుభవం ఉండడంతో, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.అదీ కాకుండా ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దానిని రాజకీయంగా ఉపయోగించుకుని టిడిపి మరింత పై చేయి సాధిస్తుందని జగన్ అంచనా వేస్తున్నారట.అందుకే లోకేష్ పాదయాత్ర విషయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమట.







