ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చి తీరాలనే టార్గెట్ ను బిజెపి హై కమాండ్ విధించుకుంది.అందుకే ఎప్పటికప్పుడు తెలంగాణ బిజెపి నేతలను అలెర్ట్ చేస్తూ, తరుచుగా బిజెపి అగ్ర నేతలు తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కేసీఆర్ ను తెలంగాణలోనే దెబ్బ కొట్టడం ద్వారా దేశ రాజకీయాల్లో ఆయనను జీరోను చేయాలనే లక్ష్యంతో బిజెపి అగ్ర నేతలు ఉన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర సంస్థ గత ఇన్చార్జి సునీల్ బన్సల్ గట్టిగానే క్లాస్ పీకారట.
గోడల మీద నేతల పేర్లు , ఫ్లెక్సీలో ఫోటోలు కాదు కమలం గుర్తును ఇంటింటికీ తీసుకువెళ్లాలి.బిజెపి ఎన్నికల గుర్తును ప్రజల్లో ప్రచారం చేయాలి.సొంతంగా దండలు, పార్టీ కండువాలు వేసుకుని వచ్చేవారు నాయకులు కాదు.పార్టీ ఎవరికి దండ వేస్తుందో వారే లీడర్లు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఎవరో పెద్ద నాయకుడు, ఎంపీనో, ఎమ్మెల్యేనో వస్తారని వేచి చూడకుండా షెడ్యూల్ ప్రకారం మండల అధ్యక్షులే పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని, అసెంబ్లీ కేంద్రంగా కాకుండా మండలాలు కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింతగా ఉధృతం చేయాలని ఆయన ఆదేశించారు.తాజాగా ప్రజాగోష, బిజెపి భరోసా బైక్ ర్యాలీలు సాగిన తీరుతో పాటు, మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంపై సునీల్ బన్సాల్ సమీక్ష నిర్వహించారు.
వీటితో పాటు తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లకు నియమితులైన పార్లమెంట్ కన్వీనర్ ప్రబారి, విస్తారక్ లతో ఆయన సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి అనేక సూచనలు చేశారు.ఈనెల 29న ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి లోక్ సభ పరిధిలోని సగం పోలింగ్ బూత్ లలో నిర్వహించాలన్నారు.ఇక ప్రజాగోషా బిజెపి భరోసా కార్యక్రమానికి పెద్ద లీడర్లు సరిగా హాజరు కావడంలేదని, కేటాయించిన నియోజకవర్గాల్లో పూర్తి సమయం ఉండడం లేదంటూ నాయకులు తన దృష్టికి తీసుకురావడాన్ని సునీల్ బన్సాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే లక్ష్యం అని,
ఎవరైనా సీనియర్ నాయకుడు రాకపోతే పార్టీ మండల అధ్యక్షుడే ఆ రోజు లీడర్ .ఆరోజు మండలంలో జరగాల్సిన కార్యక్రమాన్ని యథావిధి గా పూర్తి చేయాలని ఆయన సూచించారు.లోక్ సభ నియోజకవర్గాల్లోనూ ఏదైనా నిర్ణయించిన కార్యక్రమంలోనూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాకపోయినా ఈనెల 31 లోపు అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సూచించారు.తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలంటూ తెలంగాణ బిజెపి నేతలకు బన్సల్ గట్టిగానే క్లాస్ పీకారు.