తమ దేశంలో ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్న విదేశీయులకు కెనడా ప్రభుత్వం షాకిచ్చింది.కోవిడ్ నేపథ్యంలో ఇళ్ల ధరలకు రెక్కలు రావడంతో విదేశీయులు నివాస స్థలాలు, ఇళ్లను కొనుగోలు చేయడంపై కెనడా ప్రభుత్వం విధించిన నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ బిజినెస్ నివేదించింది.అయితే కెనడాలోని వలసదారులు, శాశ్వత నివాసితులకు మాత్రం ఈ నిషేధం నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.
కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రకారం.కెనడాలో సగటు ధరలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 8,00,000 డాలర్లకు పైగా వున్నాయి.కెనడియన్ కేంద్ర బ్యాంక్ కూడా తన వడ్డీ రేట్లను పెంచుతున్నందున ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.అలాగే దేశంలో తనఖా రేట్లు కూడా ఎక్కువగానే వున్నాయి.
అయితే కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (సీఆర్ఈఏ) ధరల సూచిక 2019 చివరి మాదిరిగానే 38 శాతంపైన వుంది.కానీ అమ్మకానికి సిద్ధంగా వున్న గృహాల జాబితా ప్రీ పాండమిక్ స్థాయికి తిరిగి వచ్చిందని సీఎన్ఎన్ తెలిపింది.
తాజాగా అమల్లోకి వచ్చిన చట్టంపై అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.కెనడా బహుళ సంస్కృతులు మేళవించిన దేశంగా ఖ్యాతిని గడించిందని పేర్కొంది.ఇప్పుడు కెనడియన్లు కానీ వారు ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలుపై నిషేధం విధించడం వల్ల ఏళ్లుగా వున్న ఆ ఖ్యాతి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది .ప్రభుత్వ నిర్ణయం వల్ల పదవీ విరమణ చేసిన వారు, ప్రశాంతమైన జీవనం గడపాలనుకునేరు అమెరికాలో వెకేషన్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారని అసోసియేషన్ అభిప్రాయపడింది.ప్రధానంగా ఫ్లోరిడా, అరిజోనాలలో అత్యధిక సంఖ్యలో ప్రాపర్టీలను కొనుగోలు చేసిన విదేశీయుల్లో కెనడియన్లే అగ్రస్థానంలో వున్నారని సీఆర్ఈఏ తెలిపింది.