తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు గత కొద్ది రోజులుగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, గ్రేటర్ పరిధిలో టిడిపికి ఆదరణ ఉంటుందని, పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఆయా ప్రాంతాల్లో టిడిపికి పునర్ వైభవం తీసుకురావచ్చు అనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.
దీనిలో భాగంగానే ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించారు. ఇక తెలంగాణ అంతట బలోపేతం అయ్యేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇదంతా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు , తెలంగాణలో టిడిపి బలం పెరిగితే బిజెపి తమతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వస్తుందని బాబు అంచనా వేశారట.తెలంగాణలో ఎప్పటి నుంచో బిజెపి పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అక్కడ బి ఆర్ ఎస్ ను ఎదుర్కొని అధికారంలోకి రావాలని చూస్తోంది.దీంతో తమతో కచ్చితంగా బిజెపి పొత్తుకు ప్రయత్నిస్తుందని బాబు అంచనా వేశారు .తెలంగాణలో బిజెపితో పొత్తు కుదిరితే ఆ సాన్నిహిత్యంతో ఏపీలోనూ బిజెపితో పొత్తు పెట్టుకుని అక్కడ అధికారంలోకి రావొచ్చని బాబు అంచనా వేశారు.అయితే బాబు ఆశలపై తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నీళ్లు చల్లారు.
తాజాగా నిర్వహించిన బిజెపి సమావేశంలో ఆ పార్టీ సీనియర్లు మాజీ ఎంపీ విజయశాంతి, ఎంపి అరవింద్ టిడిపి తో పొత్తు విషయంపై స్పందించాలంటూ బండి సంజయ్ ను కోరారు .

దీనిపై స్పందించిన ఆయన తెలంగాణలో బిజెపి, టిడిపి పొత్తు ఉండదని , ఇదే విషయాన్ని కార్యకర్తలకు కూడా చెప్పాలని ఆయన సూచించారు.అంతేకాదు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ చాలా నష్టపోయిందని ఈ సమావేశంలో విజయశాంతి చెప్పుకొచ్చారు.మొత్తంగా తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పొత్తు కొనసాగించాలని బాబు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ గట్టి జలక్ ఇచ్చినట్లయ్యింది.







