ప్రశాంతతకు మారుపేరుగా, సురక్షిత దేశంగా వున్న న్యూజిలాండ్‌లో ఇటీవల నేరాలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.
గత నెల 23న అక్లాండ్‌లోని ఓ డైరీ షాపులో పనిచేస్తున్న జనక్ పటేల్ అనే భారతీయుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.డైరీలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించడమే కాకుండా కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జనక్ పటేల్.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనతో న్యూజిలాండ్‌లోని ఇండియన్ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.దేశంలో భారతీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
అయితే దుండగుల చేతిలో బలైన జనక్ పటేల్ కుటుంబానికి అండగా నిలవాలని భావించిన ప్రవాస భారతీయులు… Give A little పేజీలో విరాళాలు సేకరించడం ప్రారంభించారు.ఇప్పటి వరకు దాదాపు 2000 మంది పెద్ద మనసుతో అతనికి సాయం చేయడానికి ముందుకొచ్చి లక్ష డాలర్లు (భారత కరెన్సీలో రూ.82 లక్షలు ) విరాళాలుగా అందజేశారు.ఈ మొత్తాన్ని త్వరలోనే జనక్ పటేల్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
ఇదిలావుండగా.జనక్ పటేల్ హత్యోదంతాన్ని మరిచిపోకముందే భారత సంతతికే చెందిన డెయిరీ యజమాని దుకాణాన్ని దొంగల ముఠా లక్ష్యంగా చేసుకుంది.
అక్లాండ్‌లోని మెల్రోస్ రోడ్‌లోని అజిత్ పటేల్‌కు చెందిన డెయిరీలోకి ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఇటీవల బేస్‌బాల్ బ్యాట్‌లతో ప్రవేశించారు.అక్లాండ్, వైకాటో ప్రాంతాల్లోని ఆరు దుకాణాలలో పటేల్ దుకాణం కూడా ఒకటి.

దోపిడి ఘటనపై పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ… నేరస్థులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఈ ఘటనల నేపథ్యంలో మౌంట్ ఆల్బర్ట్‌లోని ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎన్నికల కార్యాలయం ముందు ఇండియన్ కమ్యూనిటీ నిరసనలకు దిగింది.న్యూజిలాండ్‌లోని చాలా మంది డైరీ యజమానులు, అందులోని కార్మికులు భారత సంతతికి చెందినవారే.పునీత్ డైరీలో హత్య ఘటన తర్వాత వీరంతా విధులకు హాజరు కావడానికి భయపడుతున్నారు.
అయితే ఈ ప్రాంతంలో భద్రతా చర్యలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.ఈ ఏరియాలో కమ్యూనిటీ కానిస్టేబుళ్లు లేరని చెబుతున్నారు.
గతంలో స్థానిక వ్యాపారులు తలో చేయ్యి వేసి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని భావించారు.అయితే నిధుల కొరత కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు.







