అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి చరిత్ర సృష్టించారు.మిస్సౌరీ రాష్ట్రానికి కోశాధికారిగా వివేక్ మాలెక్ నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ మైక్ పార్సన్ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ పదవిని అలంకరించిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా వివేక్ రికార్డుల్లోకెక్కారు.
రిపబ్లికన్ నేత స్కాట్ ఫిట్జ్ ప్యాట్రిక్ ఇప్పటి వరకు ఈ స్థానంలో వున్నారు.జనవరిలో వివేక్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.2002లో హర్యానాలోని రోహ్‌తక్ నుంచి మిస్సౌరీలోని బూథీల్‌కు వలస వచ్చిన ఆయన సౌత్ ఈస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.
రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు వివేక్.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ కాలేజ్ ఆఫ్ లా నుంచి మాస్టర్ ఆఫ్ లాను అభ్యసించారు.2006లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఆయన 2011లో ఒక లా సంస్థను కూడా ప్రారంభించారు.మిస్సౌరీ సెనేట్ , మిస్సౌరీ హౌస్ ద్వారా మిస్సౌరీ కమ్యూనిటీలకు వివేక్ సేవ చేశారని గవర్నర్ కార్యాలయం ప్రశంసించింది.

2020లో వివేక్‌ను సౌత్ ఈస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు నియమించారు.స్టేట్ ట్రెజరర్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన గవర్నర్ల బోర్డులో తన పదవికి రాజీనామా చేస్తారని గవర్నర్ కార్యాలయం తెలిపింది.న్యాయవాదిగా, కమ్యూనిటీ నేతగా చేసిన సేవలకు గాను 2010లో సెయింట్ లూయి బిజినెస్ జర్నల్ నుంచి మైనారిటీ బిజినెస్ లీడర్ అవార్డ్, 2010లో మిస్సౌరీ లాయర్స్ మీడియా ద్వారా అప్ అండ్ కమింగ్ లాయర్స్ అవార్డ్‌లను వివేక్ పొందాడు.







