మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది.సుప్రీంకోర్టు లోను కాస్త ఊరట లభించడంతో, ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదని మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను విజయవంతం చేసి తమ సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఉన్నారు.
అమరావతి విషయంలో టిడిపి తమను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, మూడు ప్రాంతాల్లోనూ పట్టు సాధించి టిడిపిని మళ్ళీ అధికారానికి దూరం చేసి, మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికల్లో గెలుపొందాలనే వ్యూహానికి వైసీపీ తెరతీసింది.దీనిలో భాగంగానే డిసెంబర్ ఐదో తేదీన కర్నూల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమ గర్జనను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష ,ఇన్చార్జి మినిస్టర్ ఆదిమూలపు సురేష్ కడపలో రాయలసీమ గర్జన పేరుతో పోస్టర్ ను ఆవిష్కరించారు. శ్రీ బాగ్ వడంబడిక అమలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదంతో ఈ గర్జనను ఏర్పాటు చేయనున్నారు దీనికి భారీ జన సమీకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసేందుకు వైసిపి ప్రభుత్వం భావిస్తోంది .అలాగే విశాఖలో పరిపాలన రాజధాని అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేసేందుకు అవసరమైన తతంగం పూర్తి చేసే పనిలో ఉంది .ఈ మూడు ప్రాంతాల్లోనూ వైసిపి కి తిరుగులేకుండా చేసుకోవాలని, టిడిపి కేవలం అమరావతి నినాదంతోనే ముందుకు వెళుతుండడంతో, ఆ ప్రాంతంలోనే ఆ పార్టీకి కాస్త సానుకూలత ఉన్నా, మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత పెంచే విధంగా ఇప్పుడు రాయలసీమ గర్జనను ప్రతిష్టాత్మకంగా వైసిపి తీసుకుంది.
అలాగే ఉత్తరాంధ్ర లోనూ భారీ స్థాయిలో గర్జనను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే విశాఖలో జేఏసీ కూడా ఏర్పాటయింది .రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ మూడు రాజధానుల వ్యవహారాన్ని మరింత బలంగా తీసుకువెళ్లి అదే నినాదంతో ఎన్నికల్లో గట్టెక్కాలని, వైసిపి చూస్తూ ఉండడంతో, టిడిపి కూడా దీనికి ప్రతి వ్యూహాలు రచించే పనిలో పడింది.