విదేశాలకు వెళ్లాలంటే మనకు ఖచ్చితంగా పాస్‌పోర్టులు అవసరం.అంతేకాకుండా వీసా కూడా ఉంటేనే మనలను విదేశీ పర్యటనలకు అనుమతిస్తారు.
అయితే కొన్ని దేశాల పాస్‌పోర్టులు అత్యంత శక్తివంతమైనవి.ఆ పాస్‌పోర్టులు ఉంటే మనకు వీసా కూడా అవసరం లేకుండానే ఇతర దేశాలకు ప్రయాణించవచ్చు.
మనం పొరుగున ఉన్న నేపాల్‌కు భారత పాస్ పోర్టు ఉంటే చాలు.ఎలాంటి వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు.
ఇదే తరహాలో ప్రపంచంలో ఎక్కువ దేశాలకు ప్రయాణించగలిగేలా కొన్ని దేశాల పాస్‌పోర్టులు అనుమతిస్తాయి.ఈ జాబితా ఇటీవల విడుదలైంది.
ఇందులో జపాన్ పాస్ పోర్టు ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టుగా నిలిచింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హెన్లీ & పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల చేసింది.అందులో జపాన్ తొలి ర్యాంక్ సాధించింది.పాస్‌పోర్ట్‌లను ర్యాంక్ చేయడానికి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నుండి ప్రత్యేకమైన డేటాను ఉపయోగించారు.దీని ప్రకారం జపనీస్ పాస్‌పోర్ట్ ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
ఆ తర్వాత స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నాయి.ఈ దేశాల పాస్ పోర్టులతో 192 దేశాలకు మనం ప్రయాణించవచ్చు.అదే సమయంలో, ఈ జాబితాలో భారతదేశం 87వ స్థానంలో ఉంది.భారతీయ పాస్‌పోర్ట్‌తో 60 దేశాలకు వీసాలు లేకుండా ప్రయాణించవచ్చు.
ఈ జాబితాలో గతేడాది భారత్ ర్యాంక్ 85.అయితే ఏడాది గడిచేసరికి రెండు ర్యాంకులు దిగజారింది.ఈ జాబితాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశం ఆఫ్ఘనిస్తాన్.ఇది జాబితాలో 112వ స్థానంలో ఉంది.వీసా లేకుండా కేవలం 27 దేశాలకు మాత్రమే వెళ్లే వీలుంది.ఈ జాబితాలో రష్యా 50వ ర్యాంక్‌ను కలిగి ఉంది.119 దేశాలకు ఈ పాస్ పోర్టుతో సులభంగా ప్రయాణించవచ్చు.చైనా ఈ జాబితాలో 69వ స్థానంలో ఉంది.
పర్యాటకంగా వీసా లేకుండా ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా జాబితా నిర్ణయించబడుతుంది.