గుజరాత్ లో అధికార భారతీయ జనతాపార్టీ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది.అటు పార్టీ అభ్యర్థుల ఎంపికలో గెలుపే ప్రాతిపదికగా తీసుకుంటూ నేతల ఒత్తిడిల తలొగ్గకుండా ముందుకెళుతూ.
మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది.ప్రధానంగా సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు నిరాకరించడంలో గతంలో దేశంలో ఏ రాజకీయపార్టీ చేయని సాహసాన్ని బీజేపీ అగ్రనాయకత్వం చేయడం చర్చనీయాంశంగా మారింది .సిట్టింగ్ లకు టికెట్లు ఎగ్గొట్టడంలో తనమన భేధం లేకుండా కమలం పార్టీ వ్యూహత్మకంగా ముందుకెళ్లడం ఆ పార్టీ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపబోతుందన్నది దేశమంతా ఆసక్తికరంగా చూస్తున్న పరిణామం.గుజరాత్ 15వ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ 1 తో పాటు 5న రెండు దఫాలుగా జరగనున్నాయి.
అప్రతిహతంగా గుజరాత్ ను పాలిస్తున్న బీజేపీ ఈ సారి అభ్యర్థుల ఎంపిక విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన ఆపార్టీ సుమారు 20మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులను తమవైపు తిప్పుకుంది.
ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు కేటాయించే క్రమంతో పాటు క్షేత్రస్ధాయిలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తమ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బలమైన జలక్ ఇచ్చింది .
ఇప్పటి వరకు ప్రకటించిన 166 స్ధానాల్లో 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు తిరిగి నిరాకరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ , ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవ తో సహ ఆయా కీలకనేతలకు టికెట్లు నిరాకరించింది.ఈ క్రమంలో రెబల్స్ గా బరిలోకి దిగి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురిని ఒకే దెబ్బతో బహిష్కరించడం కూడా సామాన్యమైన విషయం కాదు .సమర్ధత , సమీకరణాలులను పరిగణనలోనికి తీసుకొని సర్వేలా ఆధారంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇదే ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.వాస్తవానికి పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలను సాగనంపాలనే క్రతువును ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
గడపగడపకు కార్యక్రమంతో ఎమ్మెల్యేల పనితీరుతో వస్తున్న అంచనాలు , మరోవైపు గత మూడున్నర సంవత్సరాల కాలంలో వారి పనితీరును నిశితంగా అంచనా వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ 2024 ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించే అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.పనితీరు మార్చుకొని ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన జగన్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు .
సుమారు 32 నుండి 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్పులకు సిద్దమవుతున్నారనే సమాచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తూంది.ఒకవేళ జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపు 20శాతానికి పైగా సిట్టింగ్ లకు షాక్ తగిలినట్లే.ప్రస్తుతం గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అవలంభిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్లు నిరాకరిస్తూ చేస్తున్న ఊచకోత కార్యక్రమం మాదిరిగానే జగన్ ఖచ్చితంగా ఏపీలో అమలుచేసే అవకాశం ఉంది .మరోవైపు టీడీపీ , జనసేన నుండి వలస వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో వారికి పార్టీ టికెట్ కేటాయించే అంశంపై జగన్ కు సానుకూలత ఉన్నప్పటికి సర్వేల్లో వచ్చే ఫలితం ఆధారంగానే జగన్ వ్యూహం అమలు చేసే అవకాశం ఉంది .మరోవైపు తెలంగాణలో యేడాది కాలంలో దూసుకురానున్న ఎన్నికలువేడి అపుడే రాజుకుంది.అధికార టీఆర్ఎస్ లో గతకొంత కాలం వరకు పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం బలంగా జరిగింది.
ఐతే తాజా జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆపార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అశలు సజీవం చేసింది .ఐతే ఈ ప్రకటనకు ఎన్నికల నాటికి కేసీఆర్ కట్టుబడి ఉంటారా ? లేక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహత్మకంగా ఈ ప్రకటన చేసారా అన్నది తేలాల్సి ఉంది .మునుగోడు ఉపఎన్నికలో టీఆరెఎస్ – కమ్యూనిస్ట్ పార్టీలతో చేసిన దోస్తీ కారణంగా వచ్చే ఎన్నికల్లో టీఆరెఎస్ లో కొందరు సిట్టింగ్ లకు సెగ తగిలే అవకాశం ఉంది .టీఆరెఎస్ వచ్చే సార్వత్రిక ఎన్నికలో కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి నడిస్తే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించాల్సిన పరిస్ధితి వస్తుంది .
ఒకవైపు పొత్తులతోనూ , మరోవైపు స్థానిక పరిస్ధితులతోనే మార్చాల్సివస్తే దీనిని ఏ విధంగా కేసీఆర్ సర్ధుబాటు చేసుకోగలరన్నది ఆసక్తికరమే .ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం ,నల్గొండ లాంటి జిల్లాలో ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది .అప్పటి పరిస్థితుల్లో తాజాగా చేసిన ప్రకటనకు కేసీఆర్ ఫిక్స్ అవుతారా లేక బలంగా దూసుకొస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు ఆయన కూడా చాలా స్ధానాల్లో ఎమ్మెల్యేలను పక్కకు పెట్టి అప్పటి సమీకరణాలను పరిగణనలోనికి తీసుకొని ముందుకెళతారా అనేది ఆసక్తికరంగా మారింది.గుజరాత్ లో మోదీషా నేతృత్వంలో బీజేపీ చాలా బలమైన నాయకత్వంతో ముందుకెళుతుంది.
ఓ స్ధాయి బలమైన నాయకత్వం ఉన్నప్పటికి …సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో అసంతృప్తిని కూడా బలంగానే ఎదుర్కొంటోంది .అసమ్మతి బావుటా ఎగరవేసినా తాజా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ తరహ అసమ్మతిని వ్యక్తం చేయడం ఆలోచించాల్సిన విషయం.మరోమారు పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందనే అంచనాలు బలంగా ఉన్నా…భవిష్యత్ లో ఏమైనా జరగనీ ప్రస్తుతం తమకు జరిగిన అవమానంతో పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికే బీజేపీ అసమ్మతి నేతలు తహతహలాడుతున్నారు .భవిష్యత్ ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సీన్ ఆవిష్కృతం అయ్యే అవకాశం లేకపోలేదు.తమ పార్టీ అధినేతలు తమ సీట్ కు సెగ పెడితే వైసీపీ , టీఆరెఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుజరాత్ తరహ సాహసం చేసే అవకాశం లేకపోలేదు.తెలుగు నాట రాజకీయాల్లో ఇదేమీ కొత్తకాదు గానీ …జగన్ , కేసీఆర్ లాంటి బలమైన లీడర్ షిప్ లో పనిచేస్తున్న ఆయా ఎమ్మెల్యేలకు కత్తిమీదసామే.