టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి ఒక పట్టాన ఎవరికి అర్థం కాదు.పార్టీపరంగా ఆయన ఏం చేసినా , ఏ నిర్ణయం తీసుకున్న అంతిమంగా టిఆర్ఎస్ కు లబ్ధి చేకూరే విధంగానే చేస్తూ ఉంటారు.
ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కకుండా , రాజకీయ చదరంగం లో పై చేయి సాధించడంలో ఆయనకు ఆయనే సాటి.మొన్నటివరకు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలను పార్టీ క్యాడర్ కు పంపించి వారిని యాక్టివ్ చేశారు.
తమకు కలిసి వస్తున్న పరిస్థితులు, ఇటీవల మునుగోడులో దక్కిన విజయంతో కేసీఆర్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే హడావుడి చాలా కాలం నుంచి నడుస్తోంది.
ముందస్తు కేసిఆర్ సిద్ధంగా ఉన్నారని, టిఆర్ఎస్ తో పాటు బిజెపి, కాంగ్రెస్ లు జనాల్లోకి, పార్టీ శ్రేణుల్లో కి తీసుకువెళ్తున్నాయి.
అందుకే ఆ రెండు పార్టీల ముఖ్య నేతలు ఎక్కడికి వెళ్ళినా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ పార్టీ కేడర్ కు సంకేతాలు ఇచ్చేవారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసీఆర్ నిన్న నిర్వహించిన కీలక సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు.తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలను ప్రకటించారు.
ముందస్తు ఎన్నికలు లేవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని , ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసిఆర్ క్లారిటీ ఇచ్చారు.అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో ప్రస్తుత టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.

ఇంకా ఎన్నికలకు 10 నెలలు మాత్రమే సమయం ఉందని, పార్టీ నేతలు అంతా సిద్ధంగా ఉండాలని , ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పరపతి పెంచుకునే ప్రయత్నాలు చేయాలని , ప్రజా సమస్యల విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని , అలాగే గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరించాలని , నిత్యం ప్రజలు , కార్యకర్తలతో మమేకమవుతూ ప్రజాబలం పెంచుకోవాలని, ఓటర్లను టిఆర్ఎస్ వైపుకు ఏ విధంగా తీసుకురావాలనే వ్యూహం పైనే అంత కసరత్తు చేయాలని, కేంద్ర అధికార పార్టీ బిజెపి మనల్ని దెబ్బ కొట్టేందుకు అడుగున ప్రయత్నిస్తూనే ఉంటుందని , వారి వ్యూహాలకు చిక్కకుండా బిజెపి వైపు జనాలు చూపు పడకుండా చూసుకోవాలని కేసిఆర్ దిశా నిర్దేశం చేశారు.అకస్మాత్తుగా కెసిఆర్ ఈ విషయాలను ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, పార్టీ శ్రేణులలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.







