సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ పథకం నెమ్మదిగా మసకబారిపోతుంది.వీటిపై కేసీఆర్ ఆలోచన ఏంటనేది ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.
ఒకసారి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామంటారు.మరోసారి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షలు ఇస్తామంటారు.ఇంకోసారి రూ.3 లక్షలు ఇస్తామంటారు.ఉప ఎన్నికలు వచ్చినప్పుడు,ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని చెబుతారు.
కానీ,ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో మంజూరైన ఇళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం జిల్లాల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు.కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 18 శాతం ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు.గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇళ్లులేని అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రాంతాల్లో వీటి నిర్మాణం పూర్తయింది.కానీ,ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎందుకు పంపిణీ చేయలేక పోయారనేది అర్దం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.జిల్లా వ్యాప్తంగా 4264 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు శాంక్షన్ కాగా లబ్దిదారులకు ఇచ్చింది.435 ఇళ్లు మాత్రమేనని తెలుస్తుంది.పంపిణీ చేయని ఇళ్లు చూసుకొని మురవడానికే చెప్పుకొని ఏడవడానికే పరిమితం అవుతున్నాయని బాధిత లబ్ధిదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీ చేయక నిరుపయోగంగా పడి ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడంతో స్థానిక ప్రజలు,మహిళలు ఆకతాయిల ఆగడాలతో బెంబేలెత్తిపోతున్నారు.
కానీ,జిల్లాలో చాలామంది ఈ పథకంపై ఆశలు పెట్టుకోగా కేవలం 435 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బెనిఫిషర్ కు అందాయి.ఇక జిల్లాలో 2015-2016,2016-2017 సంవత్సరాలలో 3923 టెండర్స్ పూర్తి కాగా,వాటిలో పనులు ప్రారంభమైనవి 3624 మాత్రమే.
అందులో 144 స్లాబ్ లెవల్ కు రాగా,135 గోడల లెవెల్ లో ఉండగా,2779 పూర్తి అయినవి.వీటికి మొత్తం రూ.174 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.ఇప్పటికీ సుమారు రూ.50 కోట్లు మాత్రమే వచ్చాయి.రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మిగిలిన పనులు చేయలేక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.
ఇదిలా ఉంటే పనులు పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న నిరుపేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.