సూర్యాపేట జిల్లా:జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తూ యువత పెడదారి పడుతుందని,మద్యం మత్తులో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ వచ్చి పోయే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,ఇలాంటి వారిపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ తెలిపారు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై గత నెల రోజులుగా రైడ్స్ నిర్వహిస్తూ 500 లకు పైగా కేసులు నమోదు చేశామని,జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం బాబులపై కేసులు నమోదు చేస్తున్నామని,పట్టణ శివారులు,నిర్మానుష్య ప్రాంతాలు, ఆట స్థలాలు,పాఠశాల ప్రాంగణాలు,చెరువు కట్టలు, వదిలేసిన కట్టడాలు లాంటి ప్రాంతాల్లో ప్రతిరోజు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేస్తూన్నారు.
జిల్లా కేంద్రానికి వచ్చే గ్రామీణ రోడ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగినదని, సమస్యాత్మక ప్రాంతాలను గ్లోబల్ జియో ట్యాగింగ్ చేసి పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు నాలుగు విడతల్లో తనిఖీలు చేస్తున్నమన్నారు.సూర్యాపేట,కోదాడ, నేరేడుచర్ల,తిరుమలగిరి,హుజూర్ నగర్,తుంగతుర్తి లాంటి ముఖ్య పట్టణాల్లో మరియు అన్ని మండల కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టం చేసినట్టు అనుమానితులను విధిగా తనిఖీలు చేపట్టామన్నారు.
ఆరుబయట మద్యం తాగే వారి సమాచారం డయల్ 100 కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలన్నారు.మద్యం ప్రియులు బహిరంగంగా మద్యం త్రాగడం మానుకోవాలని ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.